ఢిల్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ను రాజ్యసభకు పంపే ఆలోచనలో ఆ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఆమె అభ్యర్ధిత్వానికి ఇప్పటికే ఓకే చెప్పాయి. ఏప్రిల్ నెలలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాలీ కానున్నాయి. దీంతో ప్రియాంక గాంధీని ఏదో ఒక స్టేట్ నుంచి రాజ్యసభకు పంపాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రులు ఇటీవల సోనియాగాంధీ తో జరిగిన సమావేశంలో ప్రియాంక గాంధీకి రాజ్యసభ ఆఫర్ చేసినట్టు తెలిసింది. ఛత్తీస్ గఢ్ లో ఏప్రిల్ లో రెండు సీట్లు ఖాళీ అవుతుండగా..మధ్యప్రదేశ్, రాజస్థాన్ లకు ఇంకా సమయం ఉంది.
ప్రియాంక గాంధీ వాద్రాకు ఎస్పీజీ భద్రతను తొలగించిన తర్వాత లోధ్ రోడ్డులో ఆమెకు గతంలో కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా ప్రభుత్వం పదే పదే నోటీసులు పంపుతుంది. ఒకవేళ ప్రియాంక గాంధీ రాజ్యసభకు ఎన్నికైతే ఆ బంగ్లాలోనే ఉండవచ్చు. అయితే ఆమె రాజ్యసభ సీటుపై ఇప్పటి వరకు గాంధీ కుటుంబం నుంచి ఎవరూ మాట్లాడలేదు.
రాజ్యసభలో ప్రజా సమస్యలను లేవనెత్తే నాయకుల సమర్ధతను దృష్టిలో ఉంచుకొని పార్టీ హై కమాండ్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని ఢిల్లీ నుంచి రెండు సార్లు ఎంపీగా గెల్చిన కాంగ్రెస్ నేత, సందీప్ దీక్షిత్ తెలిపారు. ప్రియాంక గాంధీ మంచి వక్త…ఆమె రాజ్యసభ సభ్యురాలైతే పార్టీ లాభపడుతుందన్నారు. ఆమెకు పార్టీ ఏ బాధ్యతలు అప్పగిస్తుందో చూద్దామన్నారు.
రాజ్యసభ సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీలోనే పోటీ తీవ్రంగా ఉంది. ప్రస్తుతమున్న 18 స్థానాల్లో గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్, కుమారి సెల్జా, మోతీలాల్ వోరాల పదవీ కాలం ఈ సంవత్సరం ముగియనుంది. ఏడుగురు సభ్యులను కాంగ్రెస్ నుంచి మిగతా రెండింటిని మిత్ర పక్షాల సహకారంతో ఎన్నుకునే అవకాశముంది.