కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతు సంఘాలు శుక్రవారం కామారెడ్డి బంద్ కు పిలుపునిచ్చాయి. మాస్టర్ ప్లాన్ తో తమ పొలాలను లాగేసుకుంటున్నారని, మాస్టర్ ప్లాన్ లో ఇండ్రస్ట్రియల్ జోన్ ను తొలగించాలని రైతులు డిమాండ్ చేస్తూ గురువారం ఉదయం నుంచి రైతులు కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయాన్ని కుటుంబాలతో సహా వచ్చి ముట్టడించారు.
ఈ సందర్భంగా ఈ బంద్ కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు, కార్యకర్తలు, ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేయాలని కోరారు.
ప్రజా క్షేత్రంలోనే రైతులతో చర్చించాలన్నారు. కేవలం ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే సమస్య మరింత జఠిలం అయ్యిందని రేవంత్ అన్నారు. వెంటనే మంత్రి కేటీఆర్, జిల్లా కలెక్టర్ ప్రజలతో చర్చలు జరపాలన్నారు. రైతులతో చర్చించి సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందని చెప్పారు.