చల్లబడ్డ కండరాలు మళ్లీ ఉక్కు పిడికిళ్లు బిగిస్తున్న దృశ్యం! చచ్చుబడిన కాళ్లు సైతం లేని సత్తువ తెచ్చుకుని పరుగులు తీస్తున్న సందర్భం!! ఏడేళ్ల అపజయాలు, ఏలుతున్నవారి అవమానాలు వెక్కిరిస్తోంటే.. చస్తూ బతకలేక, చూస్తూ ఊరుకోలేక లేచి నిలబడింది కాంగ్రెస్ దండు. కొత్త నాయకత్వం ఎక్కించిన రక్తాన్ని, నిలువెల్లా నింపుకుని ఇంద్రవెల్లి వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. దిక్కులు పిక్కటిల్లెలా.. ప్రత్యర్థి గుండెల్లో వణుకుపుట్టించేలా దండోరాకు సిద్ధమవుతోంది. దళితుడే పాలకుడు అంటూ నమ్మించి ముంచిన వారిపై దండయాత్రకు శంఖం పూరించబోతోంది. తెలంగాణ కాంగ్రెస్ మలిపోరాటంలో తొలి అడుగు వేయబోతోంది.
దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరాకు కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు .. ఇప్పుడు తెలంగాణవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడూ కాదన్నట్టుగా కాంగ్రెస్ కేడర్ పట్టు బిగిస్తోంది. రెట్టింపు ఉత్సాహంతో అడుగు ముందుకేస్తోంది. ఫలితంగా.. ఏడేళ్లలో ఎన్నడూ లేని కోలాహలం ఆ పార్టీలో కనిపిస్తోంది. చాలా కాలం తర్వాత ఊరూ, వాడల్లో మళ్లీ.. కాంగ్రెస్ జెండాలు పట్టుకున్న కార్యకర్తలు ఎదురవుతున్నారు. ఇంద్రవెల్లికి వెళ్దామంటూ.. ఇంటింటికి వెళ్లి పిలుస్తున్నారు.
ఎన్నడూ లేని ఉత్సాహం, ఎప్పుడూ చూడని ఉత్తేజం.. అసలు ఇది కాంగ్రెస్సేనా అన్నట్టుగా జనమే ఆశ్చర్యపోతున్న పరిస్థితి. ఎవరెంత కాదన్నా.. ఈ క్రెడిట్ దక్కాల్సింది రేవంత్ రెడ్డికి. అవునూ.. ఆయన రాకతోనే తెలంగాణ కాంగ్రెస్ కొత్త జవసత్వాలు నింపుకుంటోంది. కొత్త రెక్కలు తొడుక్కుంటోంది. అందులో అతిశయోక్తి లేదు. ఏదేమైనా ఇంద్రవెల్లి సాక్షిగా కాంగ్రెస్ పునర్వైభవం దిశగా అడుగులు వేయడం ఖాయమే. అయితే అది సభకు వచ్చే ఎంత మందితో అన్నది లెక్కించడమే ఇక మిగిలి ఉంది.