కామారెడ్డి రైతులు మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ పూర్తి మద్దతును ప్రకటించింది. తీవ్ర మనస్తాపానికి గురై ఆత్యహత్య చేసుకున్న ఎల్లారెడ్డిగూడకు చెందిన రైతును పరామర్శించింది కాంగ్రెస్. అదే విధంగా కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వ డానికి కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ మంత్రి షబ్బీర్ అలీ కామారెడ్డికి చేరుకోవడంతో మరోసారి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
పోలీసులు ఆయనతో పాటు 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. తరువాత వదిలిపెట్టారు. ఆ తరువాత షబ్బీర్ అలీ, కిసాన్ సంఘ్ నాయకులు కోదండ రెడ్డి, అన్వేష్ రెడ్డి లు.. కామారెడ్డి జిల్లా కలెక్టర్ తో సమావేశమయ్యారు. అన్నదాతల సమస్యలను తీర్చాలని కలెక్టర్ కు కాంగ్రెస్ నేతలు వినతి పత్రం అందజేశారు. కొత్త మాస్టర్ ప్లాన్ ను సవరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఈ విషయంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ కాంగ్రెస్ నేతలకు చెప్పినట్టు సమాచారం.
అయితే కలెక్టర్ ఆఫీసులోకి కాంగ్రెస్ ముఖ్యనాయకులకు మాత్రమే లోపలికి అనుమతించారు. మీడియాను సైతం కలెక్టరేట్ లోపలికి అనుమతించలేదు పోలీసులు. కాంగ్రెస్ కార్యకర్తలు లోపలికి వెళ్లగానే కలెక్టర్ కార్యాలయ గేటును పోలీసులు మూసివేశారు. ముందస్తు చర్యగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగనివ్వకుండా కలెక్టరేట్ ముందు పోలీసులతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.