ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశానికి కట్టుబడి ఉన్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్‌లో నిర్వహించిన ప్లీనరీ సమావేశంలో కాంగ్రెస్ ప్రకటన చేసింది. ఈ మేరకు ఓ తీర్మానాన్ని ప్లీనరి ఆమోదించింది.
దీంతో పాటు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. కొండ ప్రాంతాలున్న రాష్ట్రాలకు ప్రత్యేక తోడ్పాటు ఇస్తామని చెప్పింది. ఆయా రాష్ట్రాలకు సహాయం లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదని తీర్మానంలో వెల్లడించింది.
లడక్ ప్రాంతాన్ని రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ పరిధిలోకి చేర్చి ఆ ప్రాంత ప్రజల హక్కులను పరిరక్షిస్తామని పేర్కొంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని గతంలో కాంగ్రెస్ పలు మార్లు చెప్పింది. తాము అధికారంలోకి వస్తే ఆ హామీని నెరవేరుస్తామంటూ చెబుతూ వచ్చింది.
ఇటీవల ఏపీలో భారత్ జోడో సమయంలోనూ రాహుల్ గాంధీ ఇదే విషయాన్ని వెల్లడించారు. 2014లో రాష్ట్రానికి ఇచ్చిన అన్ని హామీలన నెరవేరుస్తామని ఆయన భరోసా ఇచ్చారు. అమరావతిలో ఒకే రాజధానిని అభివృద్ది చేసేందుకు పార్టీ కట్టుబడి ఉందన్నారు.