2024 ఎన్నికలకు రోడ్ మ్యాప్ రూపకల్పనే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ శుక్రవారం ఛత్తీస్ గఢ్ రాజధాని నవా రాయ్ పూర్ లో జరగనుంది. మూడు రోజులపాటు నిర్వహించే ఈ 85 వ ప్లీనరీలో పార్టీ ముందున్న అనేక సవాళ్లపై చర్చించి తీర్మానాలను రూపొందించనున్నారు. ఈ సెషన్ కి ఎజెండాను నిర్ణయించడానికి స్టీరింగ్ కమిటీ సమావేశమయింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఎన్నికలు నిర్వహించాలా లేదా అన్న దానిపై ఈ కమిటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలు నిర్వహించే బదులు ఈ కమిటీకి సభ్యులను నామినేట్ చేసే అధికారాన్ని పార్టీ ప్రెసిడెంట్ కు అప్పగించాలని మెజారిటీ సభ్యులు కోరుతున్నారు. అయితే రాహుల్ గాంధీ మాత్రం ఎన్నికలు నిర్వహించి కొత్త సిడబ్ల్యుసిని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు
ఎన్నికలు జరగని పక్షంలో 25 మంది సభ్యులకు గాను 23 మందిని పార్టీ ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు.. రాయ్ పూర్ ప్లీనరీకి రాహుల్, సోనియా గాంధీ శుక్రవారం మధ్యాహ్నం నుంచి హాజరు కావచ్చునని తెలుస్తోంది. పార్టీ అధ్యక్షునిగా మల్లిఖార్జున్ ఖర్గే నియామకాన్ని ప్లీనరీలో ఏకగ్రీవంగా ఆమోదించే సూచనలున్నాయి. బీజేపీని ఎదుర్కోవడానికి భావ సారూప్యం గల పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు అవసరమైన వ్యూహాన్ని ఈ సమావేశాల్లో ఖరారు చేయవచ్చు.
దాదాపు 15 వేలమంది డెలిగేట్లు ప్లీనరీకి హాజరవుతారని అంచనా.. విపక్షాల మధ్యఐక్యతకు కృషి చేయాలని, ఈ ఏడాది 9 రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి తగిన వ్యూహాలను రూపొందించాలని. లోక్ సభ ఎన్నికలకు ముందు కనీసం కొన్ని రాష్ట్రాల్లోనైనా విజయం సాధించడం ముఖ్యమని పార్టీ భావిస్తోంది.
కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందు పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి.. ‘స్టేట్ పోల్ సైకిల్’ ని రూపొందించాలని కూడా పార్టీ ప్లీనరీలో నిర్ణయించే అవకాశాలున్నాయి. ఇక అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ వరకు మరో పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఓ ప్లాన్ ని ప్లీనరీ తయారు చేయవచ్చు.