జ్ఞానవాపి మసీదు వ్యవహారంపై కాంగ్రెస్ నేత ప్రమోద్ కృష్ణం కీలక వ్యాఖ్యలు చేశారు. శివలింగం అనేది మన విశ్వాసానికి సంబంధించిన విషయమన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శివ భక్తుడని గుర్తు చేశారు. సనాతన ధర్మం అన్ని మతాలను గౌరవిస్తుంది కానీ.. సొంత మతాన్ని కించపరిస్తే ఊరుకోదని స్పష్టం చేశారు.
శివలింగం విషయంలో బీజేపీ నేతలు అతి చేస్తున్నారని.. అయితే తమ పార్టీ నేతలు కూడా శివలింగాన్ని ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు ప్రమోద్. శివలింగాన్ని తమాషా అనకూడదని అన్నారు. దురదృష్టవశాత్తూ కొందరు కాంగ్రెస్ నేతలు తమను తాము గొప్ప ఉదారవాదులుగా చూపించుకునేందుకు శివలింగాన్ని కించపరుస్తున్నారని తెలిపారు.
జ్ఞానవాపి మసీదు విషయంలో బీజేపీ సరికొత్త నాటకాన్ని సృష్టిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. బీజేపీ విధానాలు, సిద్ధాంతాలు, కార్యక్రమాలు ఈ దేశాన్ని నాశనం చేయబోతున్నాయన్నారు. గెహ్లాట్ వ్యాఖ్యలపై బీజేపీ నేత స్పందిస్తూ.. కాంగ్రెస్ మరోసారి హిందువుల భక్తి విశ్వాసాలు, సంప్రదాయాలను ఎగతాళి చేస్తోందని ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలోనే ప్రమోద్ స్పందించారు.
అశోక్ గెహ్లాట్ అయినా.. అఖిలేష్ యాదవ్ అయినా.. శివలింగాన్ని తమాషా అని అనకూడదని అన్నారు. ఇది భక్తి విశ్వాసాలకు సంబంధించిన విషయమని స్పష్టం చేశారు.