కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ఈ రోజు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో బళ్లారిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఆయన కర్ణాటకలో భారత్ జోడో యాత్రలో ఉన్నారు. రాహుల్ తో పాటు పలువురు నేతలు పాదయాత్ర చేస్తున్నారు.
ఈ క్రమంలో బళ్లారిలో పాదయాత్ర క్యాంప్‌లో పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేశారు. ఆ పోలింగ్ బూత్‌లో ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలు ఓటు వేశారు.
మాజీ ప్రధాని, పార్టీ నేత మన్మోహన్ సింగ్ సైతం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి మల్లిఖార్జున ఖర్గే బెంగళూరులో ఓటు వేశారు. అధ్యక్ష ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీలో పునరుజ్జీవం మొదలైందని శశిథరూర్ వ్యాఖ్యానించారు.
ఎన్నికల ఫలితం ఎలా వచ్చినా పార్టీ భవితవ్యం మాత్రం కార్యకర్తల చేతుల్లోకి వచ్చిందని ఆయన అన్నారు. ఈ ఉదయం ఖర్గేకు తాను ఫోన్ చేసినట్టు శశిథరూర్ చెప్పారు. ఎన్నికల్లో ఎవరు గెలిచినా తర్వాత మనం స్నేహితులమేనని ఆయనతో అన్నట్టు పేర్కొన్నారు.