కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆమె వెంట ప్రియాంక గాంధీ ఉన్నారు. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు సోనియా. ఆరోగ్య కారణాల దృష్ట్యా ప్రియాంక ఉండేందుకు ఈడీ అనుమతినిచ్చింది. అయితే విచారణ గది కాకుండా మరో గదిలో ఉండేందుకు మాత్రమే ఓకే చెప్పింది.
ఇటు సోనియా విచారణ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ధర్నాలకు దిగారు. దేశవ్యాప్తంగా కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు చేపట్టారు. పార్లమెంట్ వెలుపల, లోపల సోనియా ప్లకార్డులతో కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలిపారు. రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ నేతలు ర్యాలీలకు దిగారు.
హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ దగ్గర ఉన్న ఇందిరా గాంధీ విగ్రహం దగ్గరకు భారీగా కాంగ్రెస్ శ్రేణులు చేరుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా పార్టీ నేతలు వచ్చారు. ఇందిరా గాంధీ విగ్రహం నుంచి ఈడీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. విపక్షాలే లక్ష్యంగా కేంద్రం దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందని మండిపడ్డారు రేవంత్.
కాంగ్రెస్ కు నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్యస్వామి గతంలో ఆరోపించారు. ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్ సహా ఏడుగురిపై ఢిల్లీలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు వేశారు. కేవలం రూ.50 లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు వారు యత్నించారని పిటిషన్ లో ఆరోపించారు.
ఈ కేసు విచారణలో భాగంగా ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, పవన్ బన్సల్ ను ఈడీ ప్రశ్నించింది. రాహుల్ గాంధీని కూడా విచారించింది. ఆ సమయంలో కూడా ఇలాగే కాంగ్రెస్ నేతలు దేశవ్యాప్తంగా నిరసన ర్యాలీలు కొనసాగించారు.