ప్రభుత్వ అధికారి రజత్ కుమార్ కుమార్తె పెళ్లి బిల్లుల వ్యవహారాన్ని వదిలేది లేదంటోంది కాంగ్రెస్. నాయకులు, కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఏఐసీసీ సభ్యుడు బక్క జడ్సన్ వినూత్న నిరసన తెలిపారు.
రజత్ కుమార్ లాంటి అవినీతి అధికారుల శుభకార్యాల సహాయార్థం గాంధీభవన్, పబ్లిక్ గార్డెన్ ముందు బిక్షాటన చేశారు కాంగ్రెస్ నేతలు. వచ్చిన డబ్బును రజత్ కుమార్ కు మనియార్డర్ చేశారు. తెలంగాణ అధికారులు అవినీతికి పాల్పడవద్దని.. వారి విలాసాలకు భిక్షాటన చేసి తాము డబ్బులు పంపుతామని అన్నారు జడ్సన్.
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రజత్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా ఉండి 25 లక్షల ఓట్లు లేకుండా చేశారని గుర్తు చేశారు జడ్సన్. ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేసి సారీ చెప్పిన ఆయన ఐఏఎస్ ఉగ్రవాది అంటూ విమర్శించారు. దానికి ప్రతిఫలంగానే ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శిగా కేసీఆర్ నుండి బక్షిస్ దొరికిందని ఆరోపించారు. రూ.1.15 లక్షల కోట్ల కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి… రజత్ కుమార్తె పెళ్లికి రూ.50 లక్షలు టిప్ గా వేశాడని సెటైర్లు వేశారు.
మేఘా కృష్ణారెడ్డి, కల్వకుంట్ల కుటుంబానికి ఎంత దగ్గరో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసన్నారు జడ్సన్. ఈటల రాజేందర్ ను కిషన్ రెడ్డి.. మేఘా ఫ్లైట్ లోనే ఢిల్లీకి తీసుకువెళ్ళి బీజేపీ కండువా కప్పించారని గుర్తు చేశారు. అందుకే దాదాపు రూ.12వేల కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టినా మోడీ ప్రభుత్వం మౌనంగా ఉందని ఆరోపించారు. రజత్ కుమార్ లాంటి చాలామంది అవినీతి ఐఏఎస్ అధికారులు కేసీఆర్ గడీలో ఉన్నారని అన్నారు బక్క జడ్సన్