డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ ఆలస్యంపై ఓవైపు లబ్ధిదారులు చాలా ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. పేదలకు అన్యాయం జరుగుతోందని.. టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నవారికే ఇళ్లు కేటాయిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే కొన్నిచోట్ల శిలాఫలకంతోనే సరిపెట్టిన పరిస్థితి. వాటిలో సిద్దిపేట్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం శనిగరం గ్రామం ఒకటి.
ఇక్కడ డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఎంతో ఘనంగా శిలాఫలకాన్ని వేశారు గానీ.. తర్వాత పనులేవీ ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. 2017 ఫిబ్రవరి 6న స్థానిక ఎమ్మెల్యే సతీష్ కూమార్ శనిగరం గ్రామంలో డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం శిలాఫలకం వేశారు. 40 ఇళ్ల కోసం శంకుస్థాపన చేశారు.
శిలాఫలకం వేసిన స్థలం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులకు కేటాయించింది. అందులో ఇళ్ల నిర్మాణం చేపడతామని ఐదేళ్లు గడుస్తున్నా ఏం చేయలేదని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా శిలాఫలకానికి పాలాభిషేకం చేశారు. ఇదేనా మీ అభివృద్ధి అంటూ స్థానిక ఎమ్మెల్యే సతీష్ బాబు, మంత్రి హరీష్ రావుని సూటిగా ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు.
వెంటనే నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. అర్హులై ఉండి సొంత స్థలం ఉంటే అక్కడే నిర్మించాలని చెప్పారు. శనిగరం గ్రామ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ, బీసీ సంక్షేమ సంఘం పోరాడుతాయని తెలిపారు. ఇళ్ల నిర్మాణం చేపట్టకపోతే ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు కూడా పాల్గొన్నారు.