హైదరాబాద్ కు సాగునీటి కోసం ఉన్న ప్రాజెక్టుల్లో ఒకటి హిమాయత్ సాగర్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టులో నీరుంటే హైదరాబాద్ కు డోకా ఉండదు అనేది అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవటంతో సాగర్ ఇప్పటికే నిండుకుండలా ఉంది. అయితే… వర్షాలు తగ్గుముఖం పట్టడంతో హిమాయత్ సాగర్ కు వచ్చే వరద తగ్గిపోయింది.
హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50అడుగులు కాగా ప్రస్తుతం 1762.8అడుగుల నీరుంది. మాములు గా అయితే 1763అడుగులకు నీరు చేరి, ఇంకా పై నుండి వరద వస్తే కానీ గేట్లు ఎత్తరు. అలాంటిది ఇంకా ఒక అడుగుకు ఎక్కువే జలాశయం ఖాళీగా ఉన్నా… ముంపు ప్రజలను ముందుగా అలర్ట్ చేయకుండా నీరు వదలిలేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రాజెక్టు పూర్తిగా నిండితే మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత ఫాంహౌజ్ లలోకి నీరు చేరుతుంది. దీంతో ఉన్నతాధికారులపై ఒత్తిడి చేసి… ముందుగానే హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కనీసం గేట్ల పరిసర ప్రాంత ప్రజలకు చెప్పకుండా, స్థానిక నేతలకు సమాచారం లేకుండా గేట్లు ఎత్తితే… ఎదైనా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అని వారు ప్రశ్నిస్తున్నారు.
ఎట్టి పరిస్థితుల్లో ముందుగా గేట్లు ఎత్తరాదని, హైదరాబాద్ ప్రజల తాగు నీటిని మూసీలోకి వదిలి వృధా చేస్తే సహించేది లేదని స్థానిక కాంగ్రెస్ నేతలు ప్రాజెక్ట్ గెస్ట్ హౌజ్ వద్ద ఉన్న అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు.