అదానీ గ్రూపు కంపెనీల వ్యవహారంపై భారత ప్రభుత్వం గానీ, ప్రధాని మోడీ గానీ ఇప్పటివరకు స్పందించకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పు పట్టింది. మోడీ ఎంతకాలం మౌనంగా ఉంటారని ప్రశ్నించింది. ఈ తీరు చూస్తుంటే ఇదంతా ‘కుమ్మక్కయిన వ్యవహారం’ లా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. హిండెన్ బెర్గ్ రీసెర్చ్ నివేదికతో భారతీయ షేర్ మార్కెట్ ఎన్నడూ ఎదుర్కోని జటిల పరిస్థితిని ఎదుర్కొంటోందని, స్టాక్ మార్కెట్లో అదానీ మోసపూరిత లావాదేవీలు రోజుకొకటిగా వెలుగులోకి వస్తున్నాయని ఆయన అన్నారు.
ఈ సమస్యపై మోడీని తాము మూడు ప్రశ్నలు అడుగుతున్నామన్నారు. అదానీ గ్రూప్ అంశంపై హిండెన్ బెర్గ్ నివేదిక పతాక శీర్షికలకెక్కాక .. ఈ కొన్ని రోజుల్లోనే అదానీ లిస్టెడ్ కంపెనీలు రూ. 8.76 లక్షల కోట్ల నష్టాన్ని చవి చూశాయని జైరాంరమేష్ పేర్కొన్నారు. అదానీ నిర్వాకంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయడం లేదని ప్రశ్నించిన ఆయన.. ప్రభుత్వ ఉదాసీనతను ఖండిస్తూ ఈ నెల 6 న దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు.
అదానీ మీ మిత్రుడేనని, కానీ మీ నుంచి మౌనమే ఎదురవుతోందని ఆయన మోడీని ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద స్కామ్ అని పేర్కొన్నారు.
2016 లో చైనా లోని హ్యాంగ్ జౌ సిటీలో జరిగిన జీ -20 సమ్మిట్ లో మాట్లాడిన మీరు… ఆర్ధిక నేరస్థులపై ఉక్కుపాదం మోపుతామని, మనీ లాండరింగ్ కి పాల్పడి విదేశాలకు పారిపోయినవారిని తిరిగి దేశానికి రప్పిస్తామని, అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు మరి ఏం చేస్తున్నారన్నారు. ఇక అదానీ వివాదంపై పార్లమెంటులో మళ్ళీ ప్రభుత్వాన్ని స్తంభింపజేయాలని విపక్షాలు నిర్ణయించాయి.