మేడ్చల్ లో మళ్లీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ జగడం జరిగింది. రెండేళ్ల క్రితం శంకుస్థాపన చేసిన రోడ్డు పనులను మరోసారి మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేయడంతో ఆయన్ని.. స్థానిక కాంగ్రెస్ నేత కార్యకర్తలతో పాటు కలిసి అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో కొన్ని నెలల క్రితం 100 ఫీట్ల రోడ్డు మంజూరు అయ్యింది. అయితే ప్రభుత్వం దానికి అనుగుణంగా కాంట్రాక్టర్లకు బిల్లులు పాస్ చేయకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. అయితే ఈ రోజు మళ్లీ అదే రోడ్డుకు మంత్రి మల్లారెడ్డి, కార్పొరేషన్ మేయర్ తో కలిసి శంకుస్థాపన చేశారు. అంతే కాదు రోడ్డు పనులను కొత్త కాంట్రాక్టర్ కు అప్పగించారు.
దీంతో విషయం తెలుసుకున్న కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ శ్రీకాంత్, పార్టీ కార్యకర్తలతో కలిసి మంత్రి మల్లారెడ్డి ని అడ్డుకొని ఘెరావ్ చేశారు. 100 ఫీట్ల రోడ్డుకు రెండేళ్ల క్రితం శుంకుస్థాపన చేసి.. ఇప్పుడు మామూలు రోడ్డు ఎందుకు వేస్తున్నారని.. పాత కాంట్రాక్టర్లను కాదని.. కొత్త కాంట్రాక్టర్ కు ఎందుకు ఇస్తున్నారని మంత్రిని నిలదీశారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.
ఇక మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత వరకు రోడ్డు వస్తుందో అంతవరకు వేయిస్తామని, అంబేద్కర్ నగర్ వరకు రోడ్డు వేస్తున్నామన్నారు. ప్రస్తుత రోడ్డు వల్ల స్థానికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ప్రారంభించామన్నారు. ఇక రానున్న రోజుల్లో 100 ఫీట్ల రోడ్డు వేయిస్తామని హామీ ఇచ్చారు మల్లారెడ్డి.