మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి ఛార్జిషీట్ విడుదల చేశారు. సిరిసిల్ల జిల్లా తుంగళ్లపల్లి మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్ అండతో అనుచరులు విచ్చలవిడిగా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని ఆరోపించారు.
ఇదేంటని ప్రశ్నించిన వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. అంతే గాక, కమీషన్ ఇవ్వని చేనేత కార్మికులకు బతుకమ్మ చీరల ఆర్డర్ ఇవ్వడం లేదని ఆవేదన చెందారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపులో భాగంగా ఒక్కొక్క లబ్ధిదారుడి నుంచి లక్ష చొప్పున వసూలు చేశారని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో 30 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చిన కేటీఆర్, గెలిచాక విస్మరించారని విమర్శించారు.
మంత్రి అసమర్థత కారణంగా నియోజకవర్గంలో మెడికల్ కళాశాల ఏర్పాటు కాలేదని, మంత్రి అనుచరులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఔషధాలను అక్రమంగా దోచేసి ప్రైవేట్ ఫార్మసీలో విక్రయిస్తున్నారని ఆరోపించారు. సిరిసిల్ల నుంచి కామారెడ్డి వరకు నాలుగు లైన్ల రహదారి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కేటీఆర్ మోసం చేశారని ఆయన ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు.