‘భారత్ జోడో యాత్ర’సందేశాన్ని ఇంటింటికి చేర వేసేందుకు ‘హాథ్ సే హాథ్ జోడో అభియాన్’ పేరిట కాంగ్రెస్ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. తాజాగా దీనికి సంబంధించిన లోగోను విడుదల చేసింది. దీంతో పాటు మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా ఒక చార్జిషీటును కాంగ్రెస్ విడుదల చేసింది.
ఈనెల 26 నుంచి రెండు నెలల పాటు ‘హాథ్ సే హాథ్ జోడో’ ప్రచారం కొనసాగుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర సందేశాన్ని సామాన్య ప్రజానీకానికి చేరవేసేందుకు ఈ ప్రచారం చేపడుతున్నట్టు పేర్కొన్నారు.
మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా ఒక చార్జిషీటును కూడా కాంగ్రెస్ విడుదల చేసింది. ఆయా రాష్ట్రాలకు చెందిన పీసీసీలు ఈ మేరకు చార్జిషీట్లు తయారు చేస్తాయని ఆయన తెలిపారు. మోడీ ప్రభుత్వ పాలనతో ప్రజలకు ఎదురైన ఇబ్బందుల పరిష్కారానికి తమ పార్టీ కృష్టి చేస్తుందన్నారు.
130 రోజుల భారత్ జోడో యాత్ర తర్వాత దేశ ప్రజల నుంచి విస్తృత సమాచారాన్ని కాంగ్రెస్ సేకరించిందన్నారు. రాహుల్ గాంధీ అడుగులో అడుగు వేసి ఆయనతో సంభాషించారని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వ తప్పిదాల వల్ల ప్రజలు ఎదుర్కొన్న బాధలను తాము అర్థం చేసుకున్నామన్నారు.