భారత ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేందుకు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చెందింపజేసేందుకు ఇజ్రాయెల్ కి చెందిన ‘టీమ్ జార్జ్’ పేరిట గల ఇజ్రాయెల్ ‘కాంట్రాక్టర్లకు.. బీజేపీ ఐటీ విభాగానికి మధ్య చాలా పోలికలున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇజ్రాయెల్ స్పై వేర్ ఒకప్పుడు ఇండియాలో ఎంతగా సంచలనం రేపిందో చూశామని, ఇప్పడు ఇండియా సహా సుమారు 30 దేశాల్లో ఎన్నికలను ప్రభావితం చేయగల టీమ్ జార్జ్ అదేపనిలో ఉందంటూ పత్రికల్లో వచ్చిన వార్తలపై ప్రభుత్వం దర్యాప్తు జరపాలని ఈ పార్టీ డిమాండ్ చేసింది. టీమ్ జార్జ్ తరహాలోనే పాలక బీజేపీ ఐటీ విభాగం కూడా పని చేస్తోందని పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా, సుప్రియ శ్రీనాతె విమర్శించారు.
ప్రపంచ వ్యాప్తంగా 30 కి పైగా ఎన్నికల ప్రక్రియల్లో జోక్యం చేసుకున్నదని భావిస్తున్న టీమ్ జార్జ్ .. భారత్ తో బాటు అనేక దేశాల్లో ఫేక్ సోషల్ మీడియా ప్రచారాలను నిర్వహించేందుకు ఓ సాఫ్ట్ వేర్ ని ఉపయోగించుకుంటోందని పత్రికల్లో వచ్చిన ఓ వార్తను వారు ప్రస్తావించారు. దీనిపై ప్రభుత్వం మౌనం వీడాలని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదీ స్పష్టం చేయాలని పవన్ ఖేరా అన్నారు. ఓ అంతర్జాతీయ ఏజెన్సీ ఇలా సీరియస్ ఆరోపణ చేస్తే దీనికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ఇది భారత ఎన్నికల ప్రక్రియపై నేరుగా ప్రభావం చూపుతుందని సుప్రియ శ్రీనాతె ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయుల వ్యక్తిగత డేటాకు ముప్పు కలిగే పరిస్థితి ఏర్పడిందన్నారు.
డేటా థెఫ్ట్ అన్నది తీవ్రమైనదని, సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చెందింప జేసేందుకు బీజేపీ ఐటీ సెల్ యత్నిస్తోందని ఆమె ఆరోపించారు. ఇజ్రాయెల్ టీమ్ జార్జ్ ‘కాంట్రాక్టర్లు’ ఇండియాలో కూచుని ఈ దేశ ప్రజాస్వామ్యానికే వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని, ఇతర దేశాలతో కలిసి కుట్రలకు పాల్పడుతున్నారని పవన్ ఖేరా అన్నారు. మన దేశ ఎన్నికల్లో విదేశీ హ్యాకర్లు జోక్యం చేసుకునేలా బీజేపీ ఏదైనా నెట్ వర్క్ ని వినియోగించుకుంటోందా అని ప్రశ్నించారు. ఇలాంటి స్కాండల్ పై మోడీ ప్రభుత్వం ఎందుకు దర్యాప్తు జరపదన్నారు. ‘అడ్వాన్స్డ్ ఇంపాక్ట్ మీడియా సొల్యూషన్స్’ పేరిట టీమ్ జార్జ్ యూనిట్ ఓ అధునాతన సాఫ్ట్ వేర్ ప్యాకేజీని తన కమర్షియల్ క్లయింట్లకు ఇస్తోందని బ్రిటన్ లోని ‘ది గార్డియన్’ పత్రిక పేర్కొంది. ఈ పత్రికకు చెందినవారితో సహా కొందరు జర్నలిస్టులు నిర్వహించిన అంతర్జాతీయ ఇన్వెస్టిగేషన్ ని ఇది ప్రచురించింది.
విపక్ష నేతలను టార్గెట్ చేయడానికి లోగడ పెగాసస్ స్పై వేర్ ని ఉపయోగించినట్టే .. ఆ రీతిలోనే ఇండియా సహా 30కి పైగా దేశాల్లో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు టీమ్ జార్జ్ కుట్రలు పన్నుతున్నదంటే సామాన్య విషయం కాదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. టీమ్ జార్జికి తనను అధినేతగా చెప్పుకున్న హనన్ అనే వ్యక్తితో అంతర్జాతీయ జర్నలిస్టులు కొందరు సమావేశమయ్యారని, ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవివ్ కి సుమారు 20 మైళ్ళ దూరంలో ఆయన కార్యాలయం ఉందని ది గార్డియన్ పేర్కొంది. టెలిగ్రామ్ అకౌంట్లను, వేలకొద్దీ సోషల్ మీడియా అకౌంట్లను నియంత్రించి ‘కొత్త’ కథనాలను సృష్టించగల సమర్థత తమకు ఉందని, సుమారు 20 ఏళ్లుగా ఈ కార్యకలాపాలు కొనసాగిస్తున్నామని ఇజ్రాయెల్ ప్రత్యేక బలగాల్లో పని చేసినట్టు తనను చెప్పుకున్న హనన్ .. వెల్లడించాడట. ఒక విధంగా ‘స్టింగ్ ఆపరేషన్’ లా ముఖ్యంగా ముగ్గురు జర్నలిస్టులు ఆయనతో నిర్వహించిన ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నీ వెల్లడయ్యాయి.