తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేంద్ర జల సంఘంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ బక్క జడ్సన్. గురువారం ఆయన మాట్లాడుతూ.. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నుంచి నీళ్లు తరలించే నిర్ణయాన్ని వెంటనే అడ్డుకోవాలని కోరినట్లు స్పష్టం చేశారు.
సరస్వతి, లక్ష్మి, కాకతీయ మూడు కాల్వలు ఉన్నా.. 35 మెగా వాట్ల కరెంట్ ఉత్పత్తి చేస్తోందని తెలిపారు. తెలంగాణలో 16 లక్షల ఎకరాలు నీరు అందిస్తుందన్నారు. నాందేడ్ మీడియా సమావేశంలో కేసీఆర్ మహారాష్ట్రకు బాబ్లీ దగ్గర లిఫ్ట్ పెట్టుకొని ఎస్ఆర్ఎస్పీ నీళ్లు తీసుకోండని చెప్పడం దుర్మార్గమన్నారు.
బాబ్లీ ప్రాజెక్టు దగ్గర లిఫ్ట్ పెట్టి శ్రీరాం సాగర్ కు నీళ్లు ఎత్తుకుపోండని కేసీఆర్ చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు జడ్సన్. ఇది జరిగితే 16 లక్షల ఎకరాలు తెలంగాణలో ఎడారిగా మారిపోతాయని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఎజాతీయ వాటర్ మిషన్ కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కేసీఆర్ ది తుగ్లక్ ప్రకటన అని విమర్శించారు.
ప్రజలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరినట్లు చెప్పారు జడ్సన్. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా బోలెడు నీళ్లు వస్తున్నాయని డబ్బా కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రకటనను వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.