గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు కృషి చేసిన కాంగ్రెస్ నేతలకు, క్యాడర్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
గుజరాత్ లో బీజేపీది గెలుపు కాదని.. స్థాయిని మరిచి మోడీ ప్రచారం చేశారని ఆరోపించారు. గుజరాత్ వ్యాపారులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మోడీ చెప్పి గెలిచారని అన్నారు. దేశ సంపద గుజరాత్ చేతుల్లో ఉందని మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. డబ్బు, అధికార దుర్వినియోగంతో మాత్రమే బీజేపీ వాళ్లు గెలిచారన్నారు.
గుజరాత్ లో బీజేపీ, ఆప్ మధ్యే పోటీ అని ప్రచారం చేసుకుని.. లౌకిక వాద ఓట్లన్నీ చీల్చి వాళ్లు బయటపడ్డారని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ లో ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టే గెలిచిందన్నారు. ఎంఐఎం, ఆప్ పార్టీలను మోడీ వాడుకున్నారని ఆరోపించారు. ఎంఐఎం, ఆప్ పార్టీలు బీజేపీ ట్రాప్ లో పడ్డాయన్నారు. ప్రధాని హోదాలో ఉన్న మోడీ.. తన స్థాయిని మరిచి ఎన్నికల ప్రచారం నిర్వహించారని దుయ్యబట్టారు.
సజ్జల రామకృష్ణారావు చేసిన కామెంట్స్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు భట్టి. ఎన్నో త్యాగాలతో రాష్ట్రం ఏర్పడిందన్నారు. సజ్జల కామెంట్స్ తెలంగాణ ఆకాంక్షలకు, ఆలోచనలకూ భిన్నంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. సజ్జల ఎన్ని కామెంట్స్ చేసిన ఉపయోగం లేనిదన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర ఎన్నికల కోసం కాదని చాలాసార్లు చెప్పారు.. ఆయన దేశ ఐక్యత కోసం చేస్తున్నారని స్పష్టం చేశారు భట్టి విక్రమార్క.