దేశంలోని 99 శాతం మంది కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా ఉండాలనుకుంటున్నారని సీనియర్ నేత చిదంబరం వ్యాఖ్యానించారు. 3 నెలలుగా నేను 35 బూత్ స్థాయి కార్యకర్తలతో మాట్లాడితే ఇదే అభిప్రాయం ఉందని… అయితే, పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ పోటీ చేస్తారో? లేదో? తెలియదన్నారు.
రాహుల్ పోటీ చేయవచ్చు… చేయకపోవచ్చు. ఇతర వ్యక్తులు కూడా పోటీలు ఉండొచ్చు. మే తర్వాత మాత్రం కచ్చితంగా నూతన సారథిని ఎన్నుకుంటామని చిదంబరం వెల్లడించారు. తమ పార్టీ ప్రస్తుతం కష్టాల్లో ఉందని, అయినా నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామని చిదంబరం ప్రకటించారు. అన్ని రాజకీయ పక్షాలూ ఎత్తు పల్లాలను ఎదుర్కొంటున్నట్లు గానే, కాంగ్రెస్ కూడా ఎదుర్కొంటోందని, తమలో కొన్ని లోపాలున్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం తమ స్థానాలను పదిలం చేసుకోవాల్సిందేనని నిర్మొహమాటంగా వెల్లడించారు.
నేతలంతా ఐకమత్యంగా ఉంటే కాంగ్రెస్ చాలా రాష్ట్రాల్లో బౌన్స్ బ్యాక్ అవుతుందని ఆయన ధీమాగా చెప్పారు. ఇప్పుడున్న సవాళ్లు తాత్కాలికమేనన్న ఆయన… కేరళ, తమిళనాడులో తమ ప్రభుత్వాలను స్థాపిస్తామని, అందులో ఎలాంటి సందేహమూ అవసరం లేదని ధీమా వ్యక్తం చేశారు.