భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ కు జవసత్వాలు నింపే పనిలో ఉన్నారు ఆపార్టీ నేతలు. తాజాగా తెలుగు రాష్ట్రాలపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ నేత జైరాం రమేష్. త్వరలో రాహుల్ యాత్ర ఏపీలోకి ఎంటర్ కానుంది. దీనిపై చర్చించేందుకు కర్నూలు జిల్లాలో జైరాం రమేశ్ పర్యటించారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం రెండు రాష్ట్రాలకు చెందిన నేతలతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు అంశాలపై మాట్లాడారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని స్పష్టం చేశారు జైరాం రమేష్. విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం ఏపీకి హోదా ఇచ్చి తీరుతామన్నారు. ఆ బాధ్యత కాంగ్రెస్ పై ఉందని తెలిపారు. మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ప్రకటించారని గుర్తు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఐదేళ్లు కాదు.. పదేళ్లు హోదా ఇస్తామని చెప్పి మోసం చేసిందని విమర్శించారు.
ఏపీకి చెందిన వెంకయ్య నాయుడు దీనిపై ఏం చేశారంటూ నిలదీశారు జైరాం రమేష్. రాహుల్ గాంధీ ప్రధాని అయితే తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా ఫైల్ పైనేనని స్పష్టం చేశారు. ఈ నెల 18న ఏపీలోకి రాహుల్ జోడో యాత్ర అడుగుపెట్టనుందని, ఆలూరు నియోజకవర్గం నుంచి మంత్రాలయం వరకు 4 నాలుగు రోజుల పాటు 95 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారని వివరించారు.
తెలంగాణలో 13 రోజుల పాటు పాదయాత్ర ఉంటుందన్న జైరాం.. కేసీఆర్ జాతీయ పార్టీపై సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ కాదు, కేసీఆర్ కు వీఆర్ఎస్ తప్పదని ఎద్దేవ చేశారు. తెలంగాణకు ఏమీ చేయలేని కేసీఆర్.. జాతీయ స్థాయిలో ఏం చేస్తారని ప్రశ్నించారు.