హైదరాబాద్ మహానగరంలో ఇటీవల అగ్ని ప్రమాదాలు బాగా పెరిగిపోతున్నాయన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కోదండ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన గురువారం గాంధీ భవన్ నుండి మీడియాతో మట్లాడారు. ఆస్తి నష్టంతో పాటు ప్రాణం నష్టం జరుగుతుందన్నారు. హెచ్ఎండిఏ తో పాటు ఫైర్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు.
సంబంధిత మంత్రి కేటీఆర్, తెలంగాణ ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తుందని విమర్శించారు అధికారులు, ప్రభుత్వం బాధ్యతలను విస్మరిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
తక్షణమే ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. నిబంధనలు పాటించని నిర్మాణాలపై, కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. జనావాసాల నుండి కంపెనీలను తరలించాలన్నారు.
అనంతరం కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ మాట్లాడుతూ.. ఆధునాతన యంత్రాలు, పరికరాలు ఉపయోగించుకోవడంలో తెలంగాణ సర్కారు విఫలమైందన్నారు. పురాతన పద్ధతులతో అగ్ని ప్రమాదాలను నివారించలేకపోతున్నారు. ప్రమాదాలకు గల కారణాలను అంచనా వేయలేకపోతున్నారు. నిఘా సంస్థలు, నిర్వహణ సంస్థలు నిబంధనలు పాటించి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం భావ్యం కాదని పేర్కొన్నారు చెరుకు సుధాకర్.