టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేస్తూ కాంగ్రెస్ వాళ్ళు ద్రోహులు అని అనడం చరిత్రను వక్రీకరించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. ఈ సందర్భంగా మహేష్ కుమార్ హైదరాబాద్ లోని గాంధీ భవన్ మీడియాతో మాట్లాడారు. సోనియా గాంధి దయ వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అసెంబ్లీలో కేసీఆరే చెప్పారు. రాజకీయ భోగాలు అనుభవిస్తున్నది మీరు అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ నష్టపోతుందని తెలిసి కూడా సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారు. కవిత పుట్టకముందే.. మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమం చేశారని తెలిపారు మహేష్ కుమార్.
బతుకమ్మ, వంటావార్పు చేస్తే తెలంగాణ వచ్చిందని అనుకుంటున్నారా అంటూ ఆయన ప్రశ్నించారు. తెలంగాణ వస్తే రాష్ట్రంలో ఎవరు బాగుపడ్డరనేది అందరికీ తెలుసన్నారు మహేష్ కుమార్. కవిత పుట్టక ముందే ఇందిరా గాంధీ బతుకమ్మ ఎత్తుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణ రాక ముందు, ఇప్పుడు మీ ఆస్తులు ఎంత.. చర్చకు వస్తారా.. అంటూ సవాల్ విసిరారు. అసైన్డ్ భూములు కూడా వదలడం లేదు. హైదరాబాద్ చుట్టూ ఉన్న 80 శాతం భూములు మీ చేతుల్లో ఉన్నాయని దుయ్యబట్టారు.
తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాల పరిస్తితి ఏంటి? అని ఒక్కసారి అయినా ఆలోచించారా? అంటూ ఆయన నిలదీశారు. ఇప్పుడు క్యాబినెట్ లో మంత్రులుగా ఉన్న 80 శాతం మంది ఉద్యమకారుల మీద రాళ్ళు రువ్విన వాళ్లే అని తెలిపారు మహేష్ కుమార్.
తెలంగాణ వచ్చినా.. ప్రజల బతుకులు మాత్రం మారలేదు. కానీ మీ కుటుంబ సభ్యుల బతుకులు బంగారం అయ్యాయి. ధరణి వల్ల ఎమ్మార్వో మీద పెట్రోల్ పోసి చంపే పరిస్థితి వచ్చిందన్నారు. పోడు భూముల సమస్యల వల్ల శ్రీనివాస్ అనే ఎఫ్ఆర్వో అధికారి చనిపోయాడన్నారు. కవిత తెలంగాణ కాంగ్రెస్ గురించి మాట్లాడితే ప్రజలు తిరస్కరిస్తారని తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్.