ప్రజల సమస్యలను పట్టించుకోకుండా బీజేపీ, టీఆర్ఎస్ లు భార్యా భర్తలుగా పంచాయితీలు పెట్టుకుంటున్నాయని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్, బీజేపీలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నోటీసుల పేరుతో టీఆర్ఎస్, బీజేపీలు డ్రామాలు ఆడుతున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో నలుగురు ఎమ్మెల్యేల డ్రామా మామూలుగా లేదని షబ్బీర్ అలీ సెటైర్లు చేశారు.
ఆ నలుగురిలో ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ కు అమ్ముడుపోయారని విమర్శలు చేశారు. అలాగే ఫామ్ హౌస్ కేసును విచారిస్తున్న సిట్ ఒక గుర్తుపై గెలిచి.. మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేల మీద కూడా విచారణ జరపాలన్నారు. రైతులు, ప్రజలు, లా అండ్ ఆర్డర్ సమస్యలపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టింపు లేదని మండిపడ్డారు.
ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లినా.. వెళ్లకపోయినా రాష్ట్రానికి వచ్చేదేమీ లేదన్నారు షబ్బీర్ అలీ. సీబీఐ లాంటి సంస్థ కవిత ఇంటికి రావాలా? వద్దా? అని అడగడమేంటని మండిపడ్డారు.
బీజేపీ ప్రభుత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ ద్వారా నోటీసులు ఇప్పించి ఏం సాధించిందన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసులిస్తే బీజేపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. తప్పు చేయకుంటే విచారణకు హాజరవ్వాలని డిమాండ్ చేశారు షబ్బీర్ అలీ.