బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో హిందువులే వుండాలని ఆ రాముడా చెప్పారా? అంటూ ఆయన ప్రశ్నించారు. తన రాజ్యంలో రాముడు హిందువులను ముస్లింలను సమానంగా చూశారని ఆయన అన్నారు.
హైదరాబాద్ అభివృద్ధి చెందింది నిజాం ప్రభువు వల్లనే అని ఆయన పేర్కొన్నారు. నిజాంకు కనీసం బంద్ కాల్ ఇస్తే బాగుండేదన్నారు. కనీసం అంత్య క్రియలు ముగిసే వరకైనా బంద్ పాటిస్తే బాగుండేదన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలకు సీఎం కేసీఆర్ భయపడ్డారంటూ ఆయన ఎద్దేవా చేశారు.
నిజాంను ఎందుకు గౌరవించలేదంటూ ఆయన ప్రశ్నించారు. హిందూ, ముస్లింల పేరిట బీజేపీ పంచాయితీ చేస్తోందని ఆరోపించారు. గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో మోడీ చేసిన అరాచకాలు ఎన్ని లేవని మండిపడ్డారు. నిజాం కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు కానీ ఒకే కారణంతో దోషిగా చూడటం సరికాదని సూచించారు.
ఈ ఎనిమిదేండ్లలో బీజేపీ పేదలకు ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. మోడీ రిమోట్ కంట్రోల్ నాగపూర్ లో ఉందన్నారు. ఎమ్మెల్యల కొనుగోలు కేసులో ఇక్కడ సిట్ విచారణ జరుగుతుంటే బీజేపీ సీబీఐకి ఇచ్చిందన్నారు. ఇది బీజేపీ ధ్వందనీతి అని ఆయన అన్నారు.