టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంగళవారం రాత్రి భూపాలపల్లిలో జరిగిన దాడిని కాంగ్రెస్ సీనియర్ లీడర్ వీ హనుమంతరావు తీవ్రంగా ఖండించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ పై కోడిగుడ్లతో, రాళ్లతో దాడి చేయడం కరెక్ట్ కాదన్నారు.
ఇది ప్రజాస్వామ్యామా? లేక రాచరికమా? అని ప్రశ్నించారు. దాడులు చేయడం మంచి పద్దతి కాదని హితవు పలికారు. ఆంధ్ర ప్రదేశ్ లో బీఆర్ఎస్ సభ పెడితే.. అక్కడ కూడా ఇలాగే చేయమంటారా? అని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టేయడానికే ఈ దాడులు చేశారని ఆరోపించారు. మీ ఎమ్మెల్యేలను కంట్రోల్ లో పెట్టుకోవాలని కేసీఆర్ కు సూచించారు వీహెచ్. దాడులు రిపీట్ అయితే.. అందుకు సమాధానం కూడా సీరియస్ గా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.
శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ స్టూడెంట్ సాత్విక్ సూసైడ్ ఘటనపై వీహెచ్ స్పందించారు. విద్యార్థుల పట్ల కాలేజీ యాజమాన్యం సున్నితంగా వ్యవహరించాలని తెలిపారు. హర్ట్ అయితే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని.. దీన్ని గమనించి కాలేజీ యాజమాన్యాలు నడుచుకోవాలని సూచించారు వీ హనుమంతరావు.
టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు చేస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. భౌతిక దాడులు చేస్తే మాట్లాడటం మానుకుంటారని బీఆర్ఎస్ నాయకులు అనుకోవడం వారి భ్రమ అంటూ సెటైర్లు వేశారు.