బీజేపీ నాయకులు జేపీ నడ్డా, బండి సంజయ్ లపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ వీ హనుమంతరావు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓబీసీలకు గత ప్రభుత్వాలు ఏం చేశాయో.. తొమ్మిదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో చర్చిద్దాం అంటూ సవాల్ విసిరారు. రాహుల్ అదానీ గురించి మాట్లాడితే.. బీజేపీ ఓబీసీ అంశాన్ని తెర మీదకు తెచ్చి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
రాహుల్ గాంధీపై జేపీ నడ్డా, బండి సంజయ్ లు కొత్త ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ ఓబీసీలను కించపరుస్తూ మాట్లాడాడని, ఓబీసీలకు రాహుల్ క్షమాపణలు చెప్పాలని కొత్త వాదన వినిపిస్తున్నారని ఫైర్ అయ్యారు. అసలు రాహుల్ గాంధీ ఎందుకు క్షమాపణలు చెప్పాలని వీహెచ్ ప్రశ్నించారు. అదానిపై పార్లమెంట్ లో ప్రశ్నించినందుకా? అని నిలదీశారు వీహెచ్.
అదాని విషయంపై ప్రజల దృష్టి మరల్చడానికే బీజేపీ ఓబీసీల అంశాన్ని తెరమీదకు తెచ్చిందన్నారు. ఏప్రిల్ 1న అన్ని పార్టీలతో సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు వీహెచ్. రాహుల్ గాంధీ ఓబీసీలను ఎక్కడ కింద పరిచారు అనే విషయంపై చర్చిస్తామన్నారు.
ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలతో సహా బీజేపీ విద్యార్థులు, మేధావులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. వాయినాడ్ ఎన్నికలకు 30 రోజుల గడువును ఇస్తూ సీఈసీ నిర్ణయం తీసుకుందని, సీఈసీకి ఉన్న ఆలోచన పార్లమెంట్ లో స్పీకర్ కి లేదని తేలిపోయిందన్నారు. బీజేపీ పార్టీకి తొత్తుగా స్పీకర్ పని చేస్తున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత వీహెచ్.