రేవంత్ రెడ్డి. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడో ఫైర్ బ్రాండ్ లీడర్. మాటలే కాదు చేతలతోనూ ముందుంటున్నారు. కేసీఆర్‌కు సరైన మొగుడు అంటూ తన అభిమానులు ఆప్యాయతగా పిలుచుకుంటారు. సహజంగా అయితే అలాంటి నేత ఉంటే ఏ పార్టీ అయిన సంతోషిస్తుంది, మరింత ప్రోత్సహిస్తుంది… కానీ కాంగ్రెస్‌లో మాత్రం రేవంత్ అంటేనే ఉలిక్కిపడుతున్నారు నేతలు.
నాయకుడంటే ముందుండి నడిపించాలి కానీ మాటలతో నడపకూడదని సక్సెస్ ఫుల్ పొలిటీషీయన్స్ చెప్పేమాట. కానీ తెలంగాణ కాంగ్రెస్ సీనీయర్ నేతలకు ఈ సూత్రం అస్సలు వర్తించదు. ఎవరి ఆలోచనలు వారివి. ఎవరి అవసరాలు వారివి. కానీ… తమకు మాత్రం ప్రాధాన్యత కావాలంటారు. ఏ రంగమైనా… పనిచేస్తేనే ప్రాధాన్యత వస్తుంది. జూనియర్, సీనీయర్ అని తీరిగ్గా కూర్చొని లెక్కలు పెట్టే రోజులు కావివి.
కాంగ్రెస్ పార్టీ చలో ప్రగతి భవన్ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో గాంధీబవన్ నుండి రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశారు. అప్పుడు పార్టీ నాయకులంతా హోదాలను పక్కనపెట్టి పాటించాలి. అప్పుడే ప్రోగ్రాం సక్సెస్ తో పాటు పార్టీకి మంచి పేరు వస్తుంది. పైగా ప్రకటన చేసింది దాదాపు వారం ముందే. అప్పుడు ఎవరూ చప్పుడు చేయలేదు. పైగా పీసీసీ చీఫ్‌తో మాట్లాడిన తర్వాతే ప్రకటన చేశారు. ముట్టడి ముందు రోజు కూడా ఎన్నికలున్నందున పీసీసీ చీఫ్ ఉత్తమ్ హజరుకాకపోయినా… గతంలో రేవంత్ ఎవరూ హుజూర్‌నగర్ అభ్యర్థిని ప్రకటించడానికి అని వ్యతిరేకించిన కోమటిరెడ్డి, మైనారిటీ లీడర్ షబ్బీర్ అలీ తదితరులు భేటీ అయి చర్చించారు. అందుకే పొన్నాల, జగ్గారెడ్డి సహా అన్ని జిల్లాల డీసీసీ అద్యక్షులు ప్రోగ్రాం సక్సెస్ చేసేందుకు ప్రయత్నించారు. అరెస్ట్‌లయ్యారు. రేవంత్ ప్రగతి భవన్ ముట్టడించగా… జగ్గారెడ్డి కూడా దాదాపు సక్సెస్ అయ్యారు.
అయితే, చలో ప్రగతి భవన్ పిలుపు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపింది. చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ శ్రేణులు యాక్టివ్‌గా పాల్గొన్నాయి. దీంతో క్రెడిట్ అంతా రేవంత్‌కు వెళ్తుంది అన్న కారణంతోనే… సీనీయర్స్ సహజంగానే, తమకు అలవాటున్న కాంగ్రెస్ రాజకీయాలను తెరమీదకు తెచ్చి… రేవంత్‌ను టార్గెట్ చేశారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 19 రోజుల ఆర్టీసీ సమ్మెలో ఇప్పుడు గ్రూపులు కట్టిన నేతలు ఎవరూ పాల్గొన లేదని, ముందుండి కొట్లాడాల్సిన ప్రతిపక్ష నేత, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క ఎక్కడా కనపడటం లేదని… ఎందుకు సైలెంట్ అవుతున్నారు, మధుయాష్కీకి ఇప్పుడు తెలంగాణ రాజకీయం గుర్తొచ్చిందా…? సంపత్, వంశీ ఇంకెంత కాలం అసంతృప్తితో సమర్థించుకుంటారు అని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
మీరు కొట్లాడరు, కొట్లాడే వారిని వెనక్కి లాగటం… మీ వ్యక్తిగత ప్రయోజనాలు తీరుతాయెమో కానీ, పార్టీ నష్టమని హితవు పలుకుతున్నారు.