నిన్న గాక మొన్నొచ్చాడు… పీసీసీ అధ్యక్షున్ని చేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి అధ్యక్ష పదవి అప్పజెప్పితే సీనియర్లమైన తమ పరిస్థితి ఏంటీ? మాలో ఒక్కర్ని పీసీసీ చేస్తే పార్టీని అధికారంలోకి తెస్తాం కానీ రేవంత్ ను పీసీసీ చేస్తే మీ మాట కూడా వినకుండా వన్ మ్యాన్ షో చేస్తడు… ఇలాంటి అంశాలతో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు కొందరు అధిష్టానంకు లేఖ రాసినట్లు తెలుస్తోంది.
నిజానికి రేవంత్ కు వ్యతిరేకంగా ముందు నుండి పావులు కదుపుతున్న కొందరు నేతలు… ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ అభిప్రాయ సేకరణ తర్వాత ఢిల్లీ వెళ్లి సోనియాను, రాహుల్ ను కలవాలనుకున్నారు. తమలో ఎవరికి పీసీసీ ఇచ్చినా సరే కానీ రేవంత్ కు మాత్రం వద్దంటే వద్దు అని చెప్పాలనుకున్నారు. కానీ వారు సమయం ఇవ్వలేదు సరికదా… మీరు ఢిల్లీ రానక్కర్లేదంటూ ఠాగూర్ ఆదేశాలతో ఆగిపోయారు.
కానీ అభిప్రాయ సేకరణలో ఇతర నేతలంతా పార్టీని బ్రతికించుకోవాలంటే రేవంత్ రెడ్డి మాత్రమే ప్రత్యామ్నాయం అని చెప్పటంతో సీనియర్లు ఇప్పుడు లేఖాస్త్రాన్ని సంధించారు. తమలో ఎవరికి పీసీసీ ఇచ్చినా ఓకే… మీరు చెప్పినట్లు వింటాం. కానీ రేవంత్ రెడ్డిని మాత్రం వద్దు అని వారు రాసిన లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన వ్యక్తికి పీసీసీ అప్పజెప్తే క్యాడర్ కు రాంగ్ మెసెజ్ వెళ్తుందని, ఆయన ఏకచక్రాధిపత్యంతో వెళ్తారని, నాయకులను కలుపుకొని వెళ్లకుంటే నేతలు పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉందని వారు లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
పైగా రేవంత్ రెడ్డికి ఆర్.ఎస్.ఎస్ మూలాలున్నాయని, బీజేపీ నేతలతో సన్నిహితంగా ఉంటాడని ఆ లేఖలో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డిపై అనేక కేసులున్నాయని… సీబీఐ విచారణ జరిగే అవకాశం కూడా ఉన్నట్లు సీనియర్లు తాము రాసిన లేఖలో ప్రస్తావించారు. అంతేకాదు తనను టీడీపీని వీడి వచ్చినా ఇంకా ఆ పార్టీ క్యాడర్ తో సంబంధాలు కొనసాగిస్తున్నారని, ఆ పార్టీ నేతలపై అభిమానం కూడా పోలేదన్నారు. రేవంత్ వెంట వచ్చిన వారిలో చాలా మంది నేతలు బీజేపీలోకి వెళ్లిపోయారన్నారు. తను ఎప్పటికీ గాంధీ కుటుంబానికి నమ్మినబంటు కాలేడని… పీసీసీ ఇవ్వొద్దని కోరారు. రేవంత్ పై ఈడీ కేసులు, సీబీఐ కేసులు, ఓటుకు నోటు కేసులున్నాయని, అలాంటి వ్యక్తికి పీసీసీ ఇస్తే కోర్టుల చుట్టూ తిరగటం తప్పా ఇంకొటి ఉండదని పేర్కొన్నారు. పైగా తెలంగాణలో బీసీ జనాభా ఎక్కువగా ఉన్నందున అన్ని టీడీపీ, బీజేపీలు బీసీ నేతను అధ్యక్షున్ని చేయగా, అధికార టీఆర్ఎస్ సైతం బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు.
రేవంత్ కు సోషల్ మీడియాలో తప్ప భయట ప్రజాధరణ లేదని… జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన మల్కాజ్ గిరి పరిధిలో 48 సీట్లకు 2సీట్లు మాత్రమే గెలిచారని తెలిపారు. కొడంగల్ లో తను ఓడిపోయినా మల్కాజ్ గిరి ఎంపీ అవకాశం ఇచ్చామని, అక్కడ కూడా బోటాబోటీ మెజారిటీతో మాత్రమే గెలిచారని, అంతకుముందు అదే జనరల్ సీటులో సర్వే సత్యనారాయణ గెలిచి వచ్చారని సోనియాకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
దీనిపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
సీనియర్లు రాసిన లేఖ కాపీ ఇదే…