హైదరాబాద్: టీపీసీసీ మార్పుపై కాంగ్రెస్ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చింది. కానీ, దాన్ని ప్రకటించడానికి మాత్రం ఆపసోపాలు పడుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకీ దిగజరుతుంది, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తారనే మాట ఉత్తదే అనేది ఇటు లీడర్లు, అటు కేడర్ ఓపెన్‌గానే అంటున్నారు. వాళ్లకు ఒక నమ్మకం కలిగించడంలో ఉత్తమ్ విఫలం అయ్యారనే చెప్పాలి. ఇప్పుడున్న పీసీసీ నేత వల్ల లాభం లేదు, పోనీ కొత్త నేత ఎవరైనా వస్తాడా అంటే రాడు.. ఇక కాంగ్రెస్ పని అంతే అని చాలామంది పక్క పార్టీలోకి వెళ్లిపోతున్నారు. ఇంకో సంవత్సరం పాటు పరిస్థితులు ఇలాగే ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ ఎప్పటికి అధికారంలోకి రాదనే మాట ఫిక్సయిపోతుంది.
టీఆర్ఎస్‌పై వ్యతిరేకత రావడం ఖాయమని, అప్పుడు ప్రజలకు ఉన్న ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కనుక ప్రజలు తమను మళ్లీ ఆదరిస్తారని కాంగ్రెస్ నేతలు గంపెడాశతో వుండేవారు. ఐతే, తెలంగాణలో బీజేపీ రోజురోజుకీ బలపడుతుండటం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని కలవరపరుస్తోంది. కాంగ్రెస్ నుంచి వెళ్లిన చాలామంది నేతలను బీజేపీ, టీఆర్ఎస్ అక్కున చేర్చుకుంటున్నాయి. పార్టీకి మంచి రోజులు వస్తాయని అని కొంతమంది నేతలు కాంగ్రెస్‌తోనే ఉన్నారు. ఇంకొన్ని రోజులు పార్టీ పరిస్థితి ఇలాగే ఉంటే వాళ్ళు తమ దారి తాము చూసుకుంటారు. అదే జరిగితే అది కాంగ్రెస్ పార్టీకి శాపమే. ఏపీలో జరిగినట్టే ఇక్కడ కూడా ఆ పార్టీ కొలుకోలేనంతగా నష్టపోతోందని పరిశీలకులు అంటున్నారు. ఇదంతా ఢిల్లీ నేతలకు తెలియందే కాదు. అందుకే పీసీసీ అధ్యక్ష పదవిని రేవంత్‌కు ఇవ్వాలని నిర్ణయించారు. సీనియర్ నేతలు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్‌కు పీసీసీ రాకూడదని ప్రస్తుత పీసీసి అధ్యక్షుడు ఉత్తమ్ అన్నిరకాల వ్యూహాలకు పదును పెట్టినట్టుగా తెలుస్తోంది.
తనకు మరో అవకాశం ఇవ్వమని అడిగితే అధిష్టానం తిరస్కరించడంతో ఉత్తమ్ ఇప్పుడు కొత్త వ్యూహానికి తెరలేపినట్టు చెప్పుకుంటున్నారు. ఒక వేళ పీసీసీని మార్చాల్సి వస్తే మాకు అవకాశం ఇవ్వండని మాజీ ఎమ్మ్యెల్యే సంపత్‌తో పాటు ఒక పది మంది నేతలను ఆయన రంగంలోకి దించారని అనుకుంటున్నారు. వారంతా కలిసి అధిష్టానంపై వత్తిడి తెచ్చే పనిలో ఉన్నారు. పీసీసీ మారిస్తే పార్టీలో ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని, చాలామంది తమకే కావాలని అడుగుతారని, అప్పుడిక తప్పనిసరిగా ఉత్తమ్‌నే కొనసాగిద్దామనే నిర్ణయానికి అధిష్టానం వస్తుందని ఉత్తమ్ వ్యూహం, దాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు.
ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా రేవంత్ వద్దు, మాకు ఇవ్వండని ఇన్నిరోజులూ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. తీరా రాజగోపాల్‌రెడ్డి పార్టీకీ ఎదురు తిరగడంతో వెంకట్‌రెడ్డి చేసేది లేక ఉత్తమ్ కోఠరీలో చేరిపోయారు. ఎవరికి వచ్చిన పర్వాలేదు రేవంత్‌కు మాత్రం పీసీసీ రాకూడదనే అభిప్రాయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. సీఎల్‌పీ నేత భట్టి కూడా తనకు పీసీసీ ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు, ఢిల్లీలో తనకున్న పరిచయాలతో అధిష్టానాన్ని ఒప్పించే పనిలో బిజీగా ఉన్నారు.
కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ వైపు మొగ్గు చూపుతోందని, ఇక రెండురోజుల్లో ప్రకటన కూడా రాబోతోందని ఢిల్లీ నుంచి కబురు రావడంతో గతంలో ఇలానే సీనియర్ నేత, రేవంత్‌కు బంధువు అయిన జానారెడ్డి పేరును తెరమీదకు తీసుకొచ్చి పీసీసీ మార్పును ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వాయిదా వేయించగలిగారు. ఆయనకి ఇలా పార్టీ భవిష్యతు కంటే తన భవిష్యత్తును కాపాడుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈసారి అయినా అధిష్టానం రేవంత్‌కు పీసీసీ పగ్గాలు ఇస్తుందా లేక సీనియర్ నేతల ఒత్తిడికి తలోగ్గుతుందా అనేది చూడాలి.