వరుస ఓటములు ఓవైపు, బీజేపీ జోరు మరోవైపు… కాంగ్రెస్ సీనీయర్లకు విషయం అర్థమైనట్లుంది. రాజకీయంగా తము నిలవాలన్నా, పార్టీ జెండా ఎగరాలన్న ప్రజా సమస్యలపై పోరాటం చేయాలన్న విషయం బోధపడినట్లుంది. అందుకే రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ లో కాంగ్రెస్ ముఖ్య నేతలంతా పాల్గొంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి షాద్ నగర్ మార్కెట్ యార్డు వద్ద ధర్నాలో పాల్గొంటున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరానుండగా, మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం కరీంనగర్ లో ధర్నా చేస్తున్నారు. ఇక సీఎల్పీ నేత భట్టి విక్రమార్క శామీర్ పేటలో, సంగారెడ్డి ఎమ్మెల్యే సంగారెడ్డిలో నియోజకవర్గంలోని జాతీయ రహాదారిపై రైతులతో కలిసి ధర్నా నిర్వహించనున్నారు.
ఇక, ఇతర ఎమ్మెల్యేలు… ముఖ్య నేతలంతా వారి వారి నియోజకవర్గ కేంద్రాల్లో రైతులతో కలిసి బంద్ ను విజయవంతం చేస్తున్నారు. ఈమేరకు డీసీసీ ప్రెసిడెంట్లు, జిల్లాల ముఖ్య నేతలంతా కోఆర్డినేట్ చేస్తున్నారు.
ఇన్నాళ్లు చూసి చూడనట్లు వ్యవహరించిన నేతలంతా… ఇప్పుడు రోడ్లపైకి వస్తున్నారని, కాంగ్రెస్ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే తమకు తిరుగుండదని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.