మోడీ సర్కార్ తెలంగాణకు అన్యాయం చేస్తోంటే కేంద్రంపై కేసీఆర్ ఎందుకు యుద్ధం చేయడంలేదని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. వారం రోజులు ఢిల్లీలో ఉండి మోడీ, అమిత్ షాలతో పాటు ఇతర మంత్రులను కలసినప్పుడు తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గుర్తుకు రాలేదా అని ఆ పార్టీ నాయకులు నిలదీస్తున్నారు. అక్కడే ఉండి కేంద్రాన్ని కేసీఆర్ ఎందుకు నిలదీయలేదని అడుగుతున్నారు. ఢిల్లీలోనేమో కేంద్ర పెద్దలతో అలయ్ బలయ్ తీసుకొని, హైదరాబాద్ వచ్చాకనేమో కేంద్రం అన్యాయం చేస్తోందని గగ్గోలు పెట్టడంచూసి ప్రజలు నవ్వుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.కేసీఆర్, కేటీఆర్‌లు డ్రామాలు మానుకోవాలని హితవు చెబుతున్నారు. ఢిల్లీలో మోడీ, అమిత్ షాల కాళ్లు పట్టుకొని కాళేశ్వరం, మిషన్ భగీరథలలో జరిగిన రూ. వేల కోట్ల అవినీతి కుంభకోణాన్ని బయటకు తీయవద్దని బతిమిలాడుకొని, అందుకు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్నిహక్కులను తాకట్టుపెట్టి వచ్చింది నిజం కదా అని వారు నిలదీస్తున్నారు. ఢిల్లీలో ఒకమాట హైదరాబాద్ లో ఒకమాట మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్ తమ అవకాశవాద వైఖరిని బయటపెట్టుకుంటున్నారని, ప్రజలు అంత గమనిస్తున్నారని విమర్శిస్తున్నారు.తమ కుటుంబాన్ని సీబీఐ, ఈడీల నుంచి రక్షించుకోవడానికి మోడీ,అమిత్ షాను శరణుకోరి మోకరిల్లింది నిజంకాదా అని నిలదీస్తున్నారు. మీ స్వార్థంకోసం యావత్ తెలంగాణను, వారికి తాకట్టుపెట్టి పరువు తీసారని అంటున్నారు.తెలంగాణ అంటే స్ట్రెయిట్ ఫైట్ చేసే కల్చరే గానీ… స్ట్రీట్ ఫైట్ చేసే కల్చర్ కాదని.. అలాంటి తెలంగాణ పౌరుషాన్ని కూడా కేసీఆర్, కేటీఆర్ తమ కుటుంబ స్వలాభం కోసం ఢిల్లీలో తాకట్టుపెట్టారని మండిపడుతున్నారు కాంగ్రెస్ నాయకులు.
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు నీతి, నిజాయతీ ఉంటే, నిజంగానే తెలంగాణ సమాజంపై ప్రేమ ఉంటే రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మోడీ సర్కార్ పై యుద్ధం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాని ఢిల్లీలో సైలెంట్ గా ఉండి గల్లీకి వచ్చి బస్తీమే సవాల్ అని అనడం చూస్తుంటే తారకరామారావు లాగా కాకుండా తుపాకీ రాముడిలా మాట్లాడుతున్నట్లు ఉందని ఎద్దేవా చేస్తున్నారు. తారకరామారావు బదులు తుపాకీరాముడు అని పేరు మార్చుకుంటే ఆయనకు బాగా సూటు అవుతుంది అని సెటైర్స్ వేస్తున్నారు. హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో నిత్యం వ్యవసాయ చట్టాలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడాన్ని వ్యతిరేకిస్తూ హరీష్ రావు మాట్లాడుతున్నారు.కేటీఆర్ జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తుంది అంటూ గొంతు చించుకుంటున్నారు. ధాన్యం కొనకుండా కేంద్రం తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తుందని మంత్రులు మాట్లాడుతున్నారు.ఆ మాట్లాడేవేవో ఢిల్లీలో మాట్లాడితే ప్రయోజనం ఉంటుంది తప్ప గల్లీలో మాట్లాడితే ఉపయోగం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.దీనినిబట్టి కేవలం ఓట్ల కోసం మాత్రమే టీఆర్ఎస్ కేంద్రాన్ని తిడుతోందే తప్ప తెలంగాణ మీద ప్రేమతో కాదని అర్ధం అవుతుందని వారు అంటున్నారు.
ఢిల్లీలో తాడోపేడో తేల్చుకోవాలి లేదా కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టాలి.. అంతేకాని గల్లీల్లో తిరుగుతూ ఉడత ఊపులు ఊపడం ఏమిటని ఎద్దేవా చేస్తున్నారు.కేసీఆర్ కు తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే తక్షణమే మోడీపై ఒత్తిడి తెచ్చి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని కోరుతున్నారు. కేసీఆర్ అందుకు సిద్ధంగా లేరు అంటే ఖచ్చితంగా మోడీతో లాలూచీపడ్డారనే అని అనుకోవాల్సి వస్తుందని అంటున్నారు. తన అవినీతిని అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి,తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి మోడీ దగ్గర మోకరిల్లారని అనుకోవాల్సి వస్తుందని అంటున్నారు. మోడీపై ఒత్తిడికి అవసరమైతే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని, తద్వారా తెలంగాణకు రావాల్సిన నిధులను హక్కులను రాబట్టాలని కోరుతున్నారు .