కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు రంగం సిద్ధమైంది. పార్టీ అధ్యక్ష పదవికి రేపు ఎన్నికలను నిర్వహించనున్నారు.
137 ఏండ్ల పార్టీ చరిత్రలో అధ్యక్ష ఎన్నికలు జరగడం ఇది ఆరోసారి. అధ్యక్ష పదవి కోసం సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ లో పోటీ పడుతున్నారు.
సుమారు 9 వేల మందికిపైగా పీసీసీ ప్రతినిధులు ఓటింగ్ లో పాల్గొన్నారు. 24 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టనుండటం విశేషం. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పీసీసీ కార్యాలయాల్లో, ఏఐసీసీ కేంద్ర కార్యాలయాల్లో ఎన్నికల ఓటింగ్ ను నిర్వహించనున్నారు.
భారత్ జోడో యాత్ర సందర్భంగా యాత్ర జరుగుతున్న క్యాంప్‌లోనూ పోలింగ్ ను నిర్వహించనున్నారు. ఇందులో రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖ నేతలు ఇందులో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
అధ్యక్ష ఎన్నికల కోసం పార్టీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రతి రాష్ట్రానికి ఒక రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా కాంగ్రెస్ కమిటీ పలువురు నేతలను ఎంపిక చేసింది. కేరళ నేత రాజమోహన్ ఉన్నితన్ తెలంగాణకు రిటర్నింగ్ అధికారిగా, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఢిల్లీకి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు.
ఇక ఇరువురు అభ్యర్థులు ఇప్పటికే వివిధ రాష్ట్రాల రాజధానుల్లో పర్యటనలు చేశారు. పీసీసీ ప్రతినిధుల మద్దతును పొందే ప్రయత్నాలు చేశారు. ఈ ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. సీనియర్లలో అత్యధికులు ఆయనకు మద్దతుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో థరూర్ ఆరోపణలు చేసినప్పటకీ తాము తటస్థంగా ఉన్నామని, ఎవరికి మద్దతు ఇవ్వడం లేమని గాంధీ కుటుంబం ఇప్పటికే స్పష్టం చేసింది.
ఈ ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గేకు సీరియల్ నంబరు 1, శశిథరూర్‌కు 2 నంబర్ కేటాయించారు. దీనిపై థరూర్ వర్గీయులు వ్యతిరేకత తెలిపారు. బ్యాలెట్ పేపర్‌లో సీరియల్ నంబర్ 1లో ఖర్గే, సీరియల్ నంబర్ 2లో శశిథరూర్ అని ఉండడం వల్ల ఓటర్లు గందరగోళానికి గురవుతారని పేర్కొన్నారు. అందువల్ల ఎన్నికల్లో సీరియల్ నంబర్లకు బదులుగా తమ నచ్చిన పేరుకు ఎదురుగా టిక్ పెట్టేలాగా ఎన్నికల నిబంధనను మార్చాలని శశిథరూర్ మద్దతుదారులు కోరారు.
ఈ ఎన్నికల్లో మల్లిఖార్జున ఖర్గేనే విజయం సాధిస్తారని పలువురు చెబుతున్నారు. ఆయన మొదటి నుంచి పార్టీకి, గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉండటం, ఆయనకు గాంధీ కుటుంబ మద్దతు ఉందనే వార్తల నేపథ్యంలో ఆయన విజయం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.