వెయ్యి ఎలుకలను తిన్న పిల్లి అహింస గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో.. కేసీఆర్ దళితుల గురించి మాట్లాడితే కూడా అలాగే ఉందని కాంగ్రెస్ విమర్శిస్తోంది.ఏడేళ్లుగా ఏనాడూ అంబేద్కర్ విగ్రహానికి కనీసం దండ వేసి, దండం పెట్టని కేసీఆర్‌కు దళితుల మీద ప్రేమ ఉంది అంటే నమ్మాలా అని నిలదీస్తోంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేసి, తాను కాపలా కుక్కలా ఉంటానని చెప్పి మోసం చేసిన కేసీఆర్‌ను దళితులు ఎన్నటికీ నమ్మరని ఆ పార్టీ నాయకులు మండిపడుతున్నారు.”కేసీఆర్ మాట ఇచ్చాడంటే తల నరుక్కుంటాడే తప్ప మాట తప్పడు” అని వందలాది సభలలో చెప్పిన కేసీఆర్.. ఆ మాట తప్పి, దళితులను మోసం చేసి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని వారు విమర్శిస్తున్నారు.దళితులకు మూడు ఎకరాలు ఇస్తానని ఇవ్వలేదు.. ఏడేళ్లుగా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక్క దళిత అధికారిని పెట్టుకోలేదు.ఇటీవల విమర్శలు వెల్లువెత్తడంతో ఒక దళిత అధికారిని నియమించారు అని గుర్తు చేస్తున్నారు.కేసీఆర్ దళిత అధికారులను గౌరవించి ఉంటే ఐఏఎస్,ఐపీఎస్ అధికారులు స్వచ్ఛంద పదవీవిరమణ చేసేవారు కాదు అని కాంగ్రెస్ లీడర్లు అంటున్నారు. సీఎం అయిన నాటి నుంచి ఇప్పటి వరకు దళితులను మోసం చేస్తూ వచ్చిన కేసీఆర్.. హుజురాబాద్ ఎన్నికలలో గెలవడం కోసం దళితబంధు పెట్టారే తప్ప దళితుల మీద ప్రేమతో కాదు అని అంటున్నారు.కేసీఆర్ కు దళితుల మీద నిజంగానే ప్రేమ ఉండి ఉంటే దళితుడిని ముఖ్యమంత్రిని చేసేవారు అని వారు అంటున్నారు. సీఎంను చేయలేకపోయినా కనీసం మంత్రివర్గంలో దళితులకు మంచి స్థానం కల్పించేవారు అని గుర్తు చేస్తున్నారు. క్యాబినెట్‌లో కేవలం ఒక్క ఎస్సీకి మాత్రమే స్థానం కల్పించారని తప్పు పడుతున్నారు.అది కూడా మాలకు ఇస్తే మాదిగకు ఇవ్వకుండా, మాదిగకు ఇస్తే మాలకు ఇవ్వకుండా చేసారని మండిపడుతున్నారు. కనీసం ఉప ముఖ్యమంత్రి పదవి కూడా దళితులకు ఇవ్వకుండా అవమానపరిచింది కేసీఆరే అని అంటున్నారు.ఇలాంటి కేసీఆర్‌ను దళితులు ఎందుకు నమ్మాలని ప్రశ్నిస్తున్నారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు దళితుల గురించి కాంగ్రెస్ పట్టించుకోలేదు అని కేసీఆర్ మాట్లాడడం అయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనం అని కౌంటర్ ఇస్తున్నారు ఆ పార్టీ నాయకులు.భారత రాజ్యాంగం రచించే బాధ్యతను దళితుడికి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉందని అంటున్నారు. దళితుల హక్కుల కోసం పోరాడిన మేధావి అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా ఉంటే ఆ వర్గాలకు న్యాయం జరుగుతుందని భావించే ఆ బాధ్యత ఆయనకు ఇవ్వడం జరిగిందని గుర్తు చేస్తున్నారు.కేసీఆర్ చరిత్ర తెలుసుకొని మాట్లాడితే మంచిది అని అంటున్నారు.ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా హక్కులు, రిజర్వేషన్స్ కల్పించిన చరిత్ర కాంగ్రెస్ కు ఉందని చెప్తున్నారు. పంచవర్ష ప్రణాళికల ద్వారా నెహ్రూ,గరీబీ హటావో, బ్యాంకులు జాతీయకరణతో దళితుల జీవితాలలో వెలుగులు నింపేందుకు ఇందిరా గాంధీ కృషి చేసిన విషయం కేసీఆర్ కు తెలిసినట్లు లేదని అంటున్నారు.ఇప్పటికీ ఇందిరాగాంధీ తమ నాయకురాలేనంటూ కోట్లాది మంది దళితులు చాల గర్వంగా చెప్పుకుంటారని గుర్తు చేస్తున్నారు. నేటికీ ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లే ఉందని దళితులు చెప్తుంటారని కాంగ్రెస్ లీడర్లు గుర్తు చేస్తూ.. కేసీఆర్ చరిత్ర తెలుసుకుంటే మంచిదని హితవు పలుకుతున్నారు.దళిత గిరిజనుల అభివృద్ధి కోసం ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి సబ్సిడీ రుణాలు ఇచ్చి వారికి ఆర్థిక సహాయాన్ని అందించిన చరిత్ర కాంగ్రెసుదే అని చెబుతున్నారు.ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు చట్టబద్దత కల్పించిన చరిత్ర కూడా కాంగ్రెసుదే అని గుర్తు చేస్తున్నారు.
ప్రభుత్వ భూములను దళితులకు పంచిన చరిత్ర కాంగ్రెస్‌దే అన్న విషయాన్ని కేసీఆర్ తెలుసుకోవాలని అంటున్నారు. దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను లాక్కుంటున్న చరిత్ర మీదని.. కేసీఆర్‌కు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. అనేక సంవత్సరాలుగా దళితులు సాగుచేసుకుంటున్న అసైన్డ్ భూములను పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, ప్రభుత్వ కార్యాలయాలు, టీఆరెస్ పార్టీ ఆఫీసుల కోసమని బలవంతంగా లాక్కున్నది నిజంకాదా అని కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ ను నిలదీస్తున్నారు.మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో మహాత్మగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పెట్టి దేశ వ్యాపితంగా కోట్లాది మంది దళిత ,గిరిజన, బడుగు బలహీన వర్గాలకు దళితులకు ఉపాధి చూపించింది నిజంకాదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం కేసీఆర్ కు తెలియకపోతే తెలుసుకోవాలని ఎద్దేవా చేస్తున్నారు.చరిత్ర తెలియకుండా ఏదంటే అది మాట్లాడి స్థాయి తగ్గించుకోవద్దని, తెలుసుకొని మాట్లాడడం నేర్చుకోవాలని కేసీఆర్ కు హితవు చెబుతున్నారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడడం తాను మాత్రమే దళితుల ఉద్ధరణకు పాటుపడుతున్నట్లు ఫోజులు కొట్టడం మానుకోవాలని ఘాటుగా స్పందిస్తున్నారు.దళితులను మోసం చేసిన చరిత్ర నీది. దళితులకు పెద్ద పీఠ వేసిన చరిత్ర మాది అని ఉద్ఘటిస్తున్నారు. బాబు జగ్జీవన్‌రామ్‌ను ఉప ప్రధాని, మీరా కుమారిని లోక్ సభ స్పీకర్ ను అలాగే అనేక మంది దళితులను కేంద్రమంత్రులను, రాష్ట్ర ముఖ్యమత్రులుగా చేసిన చరిత్ర కాంగ్రెస్ కు ఉందని, అది కేసీఆర్ తెలుసుకోవాలి అని అంటున్నారు. ఇలా చెప్పుకుంటూపోతే దళితుల అభ్యున్నతికి కాంగ్రెస్ చేసింది చాలానే ఉందని అంటున్నారు.ఓట్ల కోసం దళితబంధ పెట్టి తాను మాత్రమే దళితుల కోసం పాటుపడుతున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడం కేసీఆర్ మానుకోవాలని హితవు పలుకుతున్నారు.నిన్నటి దాకా దళితులను మోసం చేసి, అంబేద్కర్‌ను అవమానించిన కేసీఆర్ ఇప్పుడు ఓట్ల కోసం హడావిడి చేస్తూ దేశంలో ఎవరూ దళితుల గురించి ఆలోచించనట్లు, వారి అభ్యున్నతికి ఎవరూ కృషి చేయనట్లు మాట్లాడడం చూస్తుంటే ఇప్పటిదాకా తాను దళితులను మోసం చేసిన విషయాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంమేనని, అందరికీ అర్థం అవుతోందని అంటున్నారు.