ఇందిరా శోభన్, టీపీసీసీ అధికార ప్రతినిధి
మహిళల మానప్రాణాలకు రక్షణ కల్పించడంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పూర్తిగా విఫలమయ్యారు. మొన్న హథ్రాస్, నిన్న బలరామ్ పూర్, నేడు బదాయూలో జరిగిన వరుస హత్యాచారాల ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. యోగికి ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక అర్హతలేదు. గుడికి వెళ్లిన 50 ఏళ్ల మహిళపై ఓ పూజారే తన అనుచరులతో కలిసి ఇంతటి అఘాయిత్యానికి ఒడిగట్టడం దురదృష్టకరం.
ఈ ఉదంతం చూస్తుంటే మహిళల భద్రతకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేరే చెప్పనక్కర్లేదు. బదాయూ హత్యాచార ఘటన నిందితులను తక్షణమే శిక్షించాలి. ఇటీవల నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన నివేదిక ప్రకారం మహిళలపై అత్యధిక దాడులు జరుగుతున్న రాష్ర్టాల్లో, ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉండటం సిగ్గుచేటు. దేశంలో జరుగుతున్న మొత్తం ఘటనల్లో యూపీలోనే 25.8 శాతం జరుగుతున్నట్లు ఆ నివేదికలో వెల్లడించారు.ఇటు.. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో మైనర్లు అయిన అక్కాచెల్లెళ్లపై నాలుగు మానవ మృగాలు అత్యాచారానికి పాల్పడటం పట్ల దారుణం. ఆ నలుగురు నిందితులను కఠినంగా శిక్షించాలి. సమాజ మనుగడకు జీవం పోస్తున్న మహిళలపై అత్యాచారాలు నిత్యకృత్యం అవుతున్నా.. అటు కేంద్రంలోని మోదీ సర్కార్, యూపీలోని యోగి ప్రభుత్వం, ఇటు.. తెలంగాణలోని కేసీఆర్ సర్కార్ గానీ నిమ్మకు నీరెత్తినట్లుగానే వ్యవహరిస్తున్నాయి తప్ప.. నిందితులపై కఠినంగా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయి. రోజురోజుకీ దేశంలో మహిళల రక్షణ పట్ల ప్రజాప్రతినిధులకు గానీ, అధికారులకు గానీ చిత్తశుద్ధి కొరవడుతుండటం నిజంగా సిగ్గుచేటు.