వీర్లపల్లి శంకర్,
కాంగ్రెస్ సీనియర్ నేత, షాద్‌నగర్ నియోజకవర్గం
సీఎం కేసీఆర్ తనకు గురువులపై అమితమైన ప్రేమ ఉందని చెప్పుకుంటారు. కానీ గురువులకు తగిన వేతనం, సౌకర్యాలు కల్పించకుండా వారికే పంగనామాలు పెడడుతున్నారు. సీఎం కేసీఆర్‌తో ఉద్యోగ సంఘాల నేతలు, టీఎన్జీవో నేతలు కుమ్మకై మిగతా ఉద్యోగుల జీవితాలను తాకట్టు పెట్టి స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు మూలవేతనంపై 7.5 శాతం ఫిట్‌మెంట్(వేతన పెంపుదల) ఇవ్వాలని రాష్ట్ర వేతన సవరణ సంఘం ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే. పీఆర్సీ ప్రతిపాదించిన ఏడున్నర శాతం ఫిట్‌మెంట్ ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. 45శాతంతో వేతన సవరణ ప్రకటించాలి.
కోవిడ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నందున కోరుకున్న పీఆర్సీ సాధ్యం కాదని కమిటీ స్పష్టం చేయడం హాస్యాస్పదంగా ఉంది. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగా లేదని ఇన్నాళ్లూ ఓపిక పట్టామన్న ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, నాయకులు ఇప్పుడు ఉద్యోగస్తులకు ఎం సమాధానం చెబుతారు? మళ్లీ ఐదేళ్ల వరకు పెంచే అవకాశం ఉండదు కాబట్టి ఇప్పుడే మంచి వేతన సవరణ ఇవ్వాలి. కేంద్రం తరహాలో పిల్లల చదువుల కోసం నెలకు రూ.2500 ఇవ్వాలి. హెచ్‌ఆర్‌ఏ పాత స్లాబులు కొనసాగించాలి. సీపీఎస్ రద్దు చేయాలి. అలాగే ఒప్పంద ఉపాధ్యాయులు లేకుండా నియామకాలు చేపట్టాలి. ఉద్యోగులను సంతోష పెట్టకుండా వారిని ఇబ్బంది పెడితే బంగారు తెలంగాణ ఎలా సాధ్యమవుతుందో ముఖ్యమంత్రి ఆలోచించాలి.