తెలంగాణ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి కోసం ఏఐసీసీ కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ఏ పద్దతిలో అభిప్రాయ సేకరణ జరుపుతున్నా…అత్యధిక మంది రేవంత్ రెడ్డినే కోరుకుంటున్నట్టుగా అధిష్టానానికి నివేదికలు అందుతున్నట్టు తెలిసింది. మెజార్టీ లీడర్లు రేవంత్ రెడ్డివైపే వైపు మొగ్గుచూపుతున్నా.. పార్టీలో మోస్ట్ సీనియర్లుగా చెప్పుకునే కొంత మంది మాత్రమే ఆయన లీడర్ షిప్‌ని ఒప్పుకునేది లేదని తెగేసి చెప్తున్నారట. దీంతో రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వొద్దని చెప్పడానికి అభ్యంతరం ఏమిటి అని అధిష్టానం ఆరా తీస్తే.. కొందరు నేతలు విచిత్రమైన సమాధానం చెప్తున్నారట.
రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగిస్తే పార్టీకి మైలేజ్ వచ్చే మాట వాస్తవమే కానీ… భవిష్యత్‌లో అధిష్టానానికి అదే తలనొప్పిగా మారుతుందని వారు హితవు పలుకుతున్నారట. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పడ్డ ఇబ్బందినే హైకమాండ్ మళ్లీ పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారట. పార్టీ మొత్తం ఒకరి చుట్టే తిరిగే ప్రమాదముందని అంటున్నారట.
వీహెచ్‌లాంటి నేతలైతే.. బయటి నుంంచి వచ్చిన రేవంత్ రెడ్డికి నాయకత్వం అప్పగిస్తే తమలాంటి నేతలను అస్సలే పట్టించుకోడని… అదే జరిగితే ఇన్నాళ్లు పార్టీ పెద్దలుగా ఉన్న తమ పరిస్థితి ఏమిటి అని ప్రశ్నిస్తున్నారట. మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్న నేతలైతేనే అధిష్టానం చెప్పినట్టుగా నడుచుకుంటారని.. స్వంత నిర్ణయాలు తీసుకోరని తమ మనసులో మాట వెళ్లగక్కుతున్నారట. మరి అధిష్టానం మనసులో ఏముందో!