ప్రభుత్వం ప్రజలకు కోసం పని చేయాలని.. ఒకరిద్దరి కోసం కాదని కాంగ్రెస్ పార్టీ సూచించింది. 2022లో ప్రధాని, మంత్రులు ఏం చేయాలో సూచిస్తూ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. 130 కోట్ల మంది ప్రజల సంక్షేమం ప్రభుత్వానికి ముఖ్యం కానీ.. కొందరి క్షేమం కోసం పరితపించడం మానుకోవాలని ప్రధాని నరేంద్రమోదీకి కాంగ్రెస్ పార్టీ సూచించింది. ప్రజలమీద దృష్టి పెట్టి.. పీఆర్ (ప్రజా సంబంధాలు)ను కాస్త పక్కన పెట్టండని తెలిపింది. నేరగాళ్లను రక్షించి.. పౌరులను శిక్షించడం ప్రభుత్వం పనికాదని.. దేశ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను గుర్తు చేసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు సూచించింది. ఎన్నికల వ్యూహాలు, నేరగాళ్లను, సొంత పార్టీ పనులు రక్షించడం ప్రభుత్వ పెద్దల విధులు కాదని షా గుర్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు సంధించింది.
దేశానికి అన్నం పెడుతున్న రైతన్నకు సున్నం పెట్టడం మానుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తోమర్‌కు హితబోధ చేసింది. అన్నదాతపై దాడులు చేయకుండా వారిని ఆర్థికంగా ఆదుకోవాలని సూచించింది. ప్రభుత్వ వైఫల్యాలకు సామాన్యప్రజలపై పన్నులు వేయకుండా.. ప్రభుత్వ ఆస్తులు అమ్మకుండా.. దేశాన్ని ముందుకు నడిపించే ఆలోచనలు చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సలహా ఇచ్చింది. చైనా చొరబాట్లుకు సరైన బుద్ధి చెప్పేలా చర్యలు తీసుకోవాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపింది. సరిహద్దు ప్రాంతాలలో పొరుగు దేశాలు ఆక్రమణలు చేస్తే.. వాస్తవాలు చెప్పడంలో ప్రధాని వైఫల్యం అయ్యారని.. ఈ విషయంలో రక్షణ మంత్రి అయినా నిజాలు బయటపెట్టాని సూచించారు. కరోనా మొదటి, రెండు వేవ్ లను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని.. ఒమిక్రాన్ విషయంలో అయినా సమర్థంగా పని చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు కాంగ్రెస్ సలహా ఇచ్చింది.