పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై తెలంగాణ కాంగ్రెస్ మనసు మార్చుకుంది. ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చే ఆలోచనపై ఆ పార్టీ పూర్తిగా వెనక్కి తగ్గింది. బరిలో నిలిచి గెలవకుండా పరువు పోగొట్టుకోవడం కంటే.. ముందే పక్కకు తప్పుకోవడం మంచిదని తొలుత ఆ పార్టీ నాయకత్వం భావించింది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో పార్టీ బలహీనపడుతున్న దృష్ట్యా.. పోటీలే లేకపోతే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదముందన్న అంచనాకు వచ్చింది. దీంతో త్వరలో జరిగే నల్గొండ- వరంగల్- ఖమ్మం, రంగారెడ్డి–హైదరాబాద్– మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేసేందుకు డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది.
నల్లగొండ స్థానం నుంచి పోటీకి ఇప్పటికే కాంగ్రెస్‌లో 26 మంది అభ్యర్థులు రాష్ట్ర నాయకత్వానికి అభ్యర్థనలు పంపారు. అయితే ఇందులో ప్రధానంగా దాసోజు, రాములు నాయక్, మానవతారాయ్, బెల్లయ్యనాయక్ పేర్లను పరిశీలిస్తున్నట్టుగా తెలిపింది. అటు రంగారెడ్డి స్థానానికి కూడా 20కి పైగా అప్లికేషన్లు రాగా.. ప్రధానంగా జి. చిన్నారెడ్డి, వంశీచంద్, సంపత్, కూన, హర్షవర్దన్‌రెడ్డి, ఇందిరాశోభన్, కత్తి వెంకటస్వామి, ఎం.ఆర్.జి.వినోద్‌రెడ్డిల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇందులో ఒక్కో స్థానం నుంచి ముగ్గురి చొప్పున అధిష్టానానికి పంపుతారని తెలిసింది.
మరోవైపు ఇన్నాళ్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై కాంగ్రెస్ ఆసక్తి చూపడంతో.. ఆ పార్టీ మద్దతు ఇస్తుందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌తో పాటు పలు సంఘాల నేతలు చాలా ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ కూడా బరిలోకి దిగుతుండటంతో.. ఆ పార్టీతోనే పోటీ పడాల్సిన పరిస్థితి రానుంది.