అప్పుడెప్పుడో ఆఖరి నిమిషంలో ఆగిపోయిన, అందరూ మరిచిపోయిన తెలంగాణ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. సాగర్ ఉప ఎన్నిక తర్వాత పీసీసీ అధ్యక్షుడి పేరు ప్రకటన ఉంటుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గుర్తు చేశారు. అధ్యక్ష పదవి ఎవరికి అప్పగించాలన్నది హైకమాండే నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ప్రభావం నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై ఉండబోదని ధీమా వ్యక్తం చేసిన భట్టి.. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి గెలుపు ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.
తెలంగాణలో షర్మిల పెట్టబోయే కొత్త పార్టీపై స్పందిస్తూ.. ఆమెతో కాంగ్రెస్‌కు ఎలాంటి నష్టం లేదని అన్నారు. నష్టం జరిగే అవకాశం ఉంటే.. అది కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ ఉంటుందని జోస్యం చెప్పారు. తన తండ్రి వైఎస్సార్‌ను సీఎం చేసిన పార్టీ కాంగ్రెస్సే అన్న విషయాన్ని షర్మిల గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు భట్టి.