– వ్యవసాయరంగంపై ఛార్జ్ షీట్
– రైతుబంధు పేరుతో దగా
– అన్నదాతల ఆత్మహత్యల్లో 4వ స్థానం
– అధ్వాన్నంగా కౌలు రైతుల పరిస్థితి
– నట్టేట ముంచుతున్న నకిలీ విత్తనాలు
– కేసీఆర్ పాలనపై కాంగ్రెస్ ఫైర్
టీ కాంగ్రెస్ స్పీడ్ పెంచుతోంది. హాథ్ సే హాథ్ జోడో యాత్రతో తెలంగాణ సర్కార్ పై సమరశంఖాన్ని పూరించింది. తాజాగా బీఆర్ఎస్ పాలనపై మూడో ఛార్జ్ షీట్ విడుదల చేసింది. వ్యవసాయ రంగమే ప్రధానంగా ఆదివారం ఛార్జ్ షీట్ విడుదల చేసింది. వ్యవసాయాన్ని పండుగ చేస్తామన్న కేసీఆర్ పాలనలో దండగ అయ్యేలా మారిందని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఛార్జ్ షీట్ విడుదల చేశారు. రైతులకి ఏ రకమైన సబ్సడీలు లేవని.. కేవలం రైతు బంధుతో దగా చేస్తున్నారని మండిపడ్డారు.
రుణమాఫీ చేయక కొత్త రుణాలు పుట్టక రైతులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతుల పరిస్థితి అధ్వాన్నంగా మారిందన్న ఆయన.. గతేడాది వెయ్యి మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రైతు ఆత్మహత్యల్లో దేశంలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది అంటే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోందని విమర్శలు గుప్పించారు.
రైతుల ఆత్మహత్యలను అపహాస్యం చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి ఆ స్థానంలో కొనసాగే అర్హత లేదని అన్నారు. రైతు బంధు వల్ల కేవలం భూస్వాములకే మేలైతే కౌలు రైతుల సంగతి ఏంటని ప్రశ్నించారు. భూకమతాలు, భూవిస్తరణ ఒకటి కాదు కానీ ఒకటే అని భ్రమ కలిపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో 70 శాతం కౌలు రైతులే ఉన్నారని మండిపడ్డారు.
వారి కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని పేర్కొన్నారు. సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా అంటూ ప్రగల్బాలు పలికారుగా మరి ఇప్పుడు ఏమైంది అని నిలదీశారు.నకిలీ విత్తనాల వల్ల ఏటా 15 లక్షల ఎకరాల పంట నష్టం వస్తోందన్న ఆయన.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విరుచుకుపడ్డారు.వరి వేసే ఉరి అని కేసీఆర్ రైతులను సాగుకు దూరం చేశారని అన్నారు. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా మద్దతు ధర ఎందుకు పెంచట్లేదని ప్రశ్నించారు. పంట బీమా లేని రాష్ట్రంగా చేసిన పాపం కేసీఆర్ దే అని ఆరోపించారు.
ఇక జార్ఖండ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో సొంతంగా పంట బీమా ఇస్తున్నారు.. తెలంగాణలో ఏమైందని నిలదీశారు. వ్యవసాయంలో యాంత్రీకరణకు మంగళం పాడిన ఘనత కేసీఆర్ దే అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయం విధ్వంసం అయిందని.. రైతాంగం పూర్తిగా నిర్వీర్వమైందని విమర్శించారు.