ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా.. ఇద్దరూ ఓటు వేశాక కూడా గుజరాత్ ఓటర్లను ప్రభావితం చేసేలా ‘ప్రచారం’ నిర్వహించారని ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. రెండో దశ ఎన్నికల్లో మోడీ.. అహ్మదాబాద్ లోని ఓ స్కూల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం చాలా దూరం నడుచుకుంటూ .. తనను చూసేందుకు రోడ్డుకు రెండు వైపులా నిలబడిన ప్రజలకు అభివాదం చేస్తూ సాగారు.
అలాగే అమిత్ షా కూడా ఓటు వేశాక..బీజేపీ ఎంపీ ఒకరితో కలిసి నడుస్తూ ‘ప్రచారం’ వంటిది చేశారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా మండిపడ్డారు. పోలింగ్ రోజున కూడా మోడీ రెండున్నర గంటల పాటు భారీ రోడ్ షో నిర్వహించారని, దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు.
రాష్ట్ర మొదటి దశ ఎన్నికల్లో మోడీ సుమారు 50 కి.మీటర్ల మెగా రోడ్ షో నిర్వహించారు.నిన్న తమ గిరిజన నాయకుడు, దంతా నియోజకవర్గ ఎమ్మెల్యే కాంతి ఖరాడీ తనకు రక్షణ కల్పించాలని ఈసీని ముందే కోరారని, కానీ ఈ సంస్థ స్పందించలేదని పవన్ ఖేరా విమర్శించారు.
ఆయనపై సుమారు 24 మంది బీజేపీ ‘గూండాలు’ దాడి చేయడానికి యత్నించగా ఆయన 15 కిలో మీటర్ల దూరం పరుగెత్తి అడవుల్లో తలదాచుకున్నారని ఖేరా పేర్కొన్నారు. గుజరాత్ లో మద్య నిషేధం అమల్లో ఉన్నప్పటికీ బీజేపీ నేతలు ఓటర్లకు మద్యాన్ని సరఫరా చేశారన్నారు. కానీ ఈసీ ఎలాంటి చర్య తీసుకోలేదన్నారు. ఈసీ చేవ లేని సంస్థలా తయారైందని పవన్ ఖేరా దుయ్యబట్టారు.