కర్ణాటక ఎన్నికల్లో మహిళల ఓట్లను చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కొత్త వ్యూహానికి శ్రీకారం చుట్టింది. కేవలం మహిళల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టోను రూపొందించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈ నెల 16 న రాష్ట్రాన్ని సందర్శించి మహిళల సభలో ప్రసంగిస్తారని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీ.కె. శివకుమార్ తెలిపారు. ఆ సందర్భంగా ఆమె ఈ మేనిఫెస్టో ను విడుదల చేస్తారని ఆయన చెప్పారు. . రానున్న ఏప్రిల్-మే నెలల్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న దృష్ట్యా.. మహిళల ప్రయోజనాలకు ఉద్దేశించిన ‘గ్యారంటీ లెటర్’ ని సైతం ప్రియాంక గాంధీ రిలీజ్ చేస్తారని అన్నారు. .ఈ మేనిఫెస్టో, గ్యారంటీ లెటర్ పై నేతలందరి సూచనలు, సలహాలను ఈ నెల 15 వరకు ఆహ్వానిస్తున్నామని శివకుమార్ చెప్పారు.
రామనగర, మాండ్యా జిల్లాలకు చెందిన జేడీ-ఎస్ నేతలు విశ్వనాథ్ , రాధాకృష్ణ తమ సహచరులతో వచ్చి సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా శివకుమార్ మీడియాతో మాట్లాడారు. వీరిలో విశ్వనాథ్ లోగడ జరిగిన ఎన్నికల్లో కనకపుర అసెంబ్లీ నియోజకవర్గంలో శివకుమార్ పై పోటీ చేశారు. దేశ జనాభాలో మహిళలు 50 శాతం మంది ఉన్నారని, వీరి ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వవలసి ఉందని శివకుమార్ చెప్పారు.
వీరిలో నాయకత్వ లక్షణాలను పెంచవలసి ఉందని అందువల్లే తమ పార్టీ దీనిపై దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. బెంగుళూరులోని ప్యాలస్ గ్రౌండ్ లో జనవరి 16 న జరిగే సభలో పంచాయతీ స్థాయి నుంచి సొసైటీ స్థాయి వరకు మహిళా నేతలంతా పాల్గొంటారన్నారు.
ఈ సభకు జాతీయ నాయకులు కూడా హాజరవుతారని శివకుమార్ చెప్పారు. రాజకీయంగా, విద్యా పరంగా, ఆర్ధిక పరంగా.. ఇంకా సామాజిక పరంగా కూడా మహిళలను మరింత బలోపేతం చేయాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమని అన్నారు. కర్ణాటకను ప్రియాంక ‘రాజకీయంగా విజిట్’ చేయడం ఇదే మొట్టమొదటిసారి. మహిళా సాధికారతకు ఆమె అధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు శివకుమార్ చెప్పారు. త్వరలో తాను, పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తామని ఆయన తెలిపారు.