గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. నీకొకటి, నాకొకటి అన్నట్టుగా గుజరాత్ ని బీజేపీ కైవసం చేసుకోగా , చిన్న రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది.ఈ రాష్ట్రంలో మార్పును కోరుకున్న ఓటర్లు ఈ పార్టీకి పట్టం కట్టారు. విచిత్రంగా .. 1985 నుంచి ప్రతి ఎన్నికకు పాలక పార్టీని ‘పక్కన పెట్టే’ ట్రెండ్ ఇక్కడ సాగుతోంది. 68 సీట్లున్న అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 40 స్థానాలను గెలుచుకోగా , బీజేపీ 25 సీట్లను దక్కించుకుంది. ఆప్ ఇక్కడ తన ఖాతాను తెరవలేకపోయింది. ఇండిపెండెంట్ అభ్యర్థులు ముగ్గురు గెలిచారు.
ఈ సారి హిమాచల్ లో బీజేపీ ఓటమి అంటే.. ఓటర్లు మార్పును కోరినట్టేనని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో మహిళలు ఇదివరకటి కన్నా ఎక్కువ సంఖ్యలో ఓటు వేశారు. వీరి ఓట్ల శాతం 76.8 శాతం ఉంది. ఇదిపురుషుల ఓట్ల శాతం కన్నా 4 శాతం ఎక్కువ. ధరల పెరుగుదలను అరికట్టలేని బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది.
పైగా టికెట్ల పంపిణీలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య చాలా వ్యత్యాసం ఉందని, బీజేపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలచుకున్నదని తెలుస్తోంది. పార్టీలో రెబెల్స్ ను కాంగ్రెస్ బుజ్జగించి తనవైపు తిప్పుకోగా.. దానిపై బీజేపీ ఫోకస్ పెట్టలేదు. పైగా పలువురు ప్రముఖ నాయకులకు బీజేపీ టికెట్లు నిరాకరించింది. వీరిలో మాజీ సీఎం ప్రేమ్ కుమార్ ధుమాల్, గులాబ్ సింగ్ వంటివారున్నారు.
తమ యాపిల్ పండ్లకు బీజేపీ ప్రభుత్వం గిట్టుబాటు ధరలను కల్పించడం లేదని యాపిల్ పండ్ల తోటల పెంపకం దారులు అనేక సార్లు చేసిన ఆందోళన కూడా ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కారణమైంది. రాష్ట్రంలో అదానీ అగ్రి ఫ్రెష్ అనే సంస్థ నిర్ణయించిన ప్రొక్యూర్మెంట్ ధర చాలా తక్కువగా ఉందని వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చారు.
హిమాచల్ ఎన్నికల ప్రక్రియలో ‘యాపిల్ బెల్ట్’ అన్నది కీలకంగా ఉంది. రాష్ట్ర ఎకానమీకి యాపిల్ పంట సుమారు 5 వేల కోట్లవరకు ఆదాయాన్ని సమకూరుస్తోంది. ఈ ఎన్నికల్లో ఇది సుమారు 20 నుంచి 25 స్థానాల్లో తన ప్రభావాన్ని చూపింది. సిమ్లా లోని, మండి, కుల్లు, కిన్నౌర్ వంటి జిల్లాల్లోనూ, మరి కొన్ని చోట్ల ‘యాపిల్’ ఎఫెక్ట్ పడింది. ఇక ప్రియాంక గాంధీ నేతృత్వంలో పలువురు సీనియర్ నేతలు ఈ రాష్ట్ర ఎన్నికల ముందు విస్తృత ప్రచారం చేశారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే కల్పిస్తామన్న సౌకర్యాలకు, రాయితీలకు సంబంధించి వారిచ్చిన హామీలను ప్రజలు నమ్మారు. .