2024 ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ టెలిస్కోప్ తో చూసినా కనబడదని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. ఎన్నికలు జరగనున్న నాగాలాండ్ లో సోమవారం జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆయన.. నాగా రాజకీయ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు, శాంతి చర్చలు ఫలించేలా చూడడానికి కేంద్రంకృషి చేస్తోందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఈ రాష్ట్రంలో ఎన్డీపీపీ-బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ప్రధాని మోడీని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా. ‘నరేంద్ర గౌతమ్ దాస్ మోడీ’ అని ఎద్దేవా చేయడాన్ని ఆయన ఖండించారు. ఇది ఖేరా ప్రకటన కాదని, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ‘ఒరవడి లో నుంచి వచ్చిందని ఆయన ఆరోపించారు. 2019 లో కూడా కాంగ్రెస్ పార్టీ మోడీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిందని, ఫలితంగా ప్రతిపక్ష హోదాను కోల్పోయిందని అమిత్ షా చెప్పారు.
ఆయన మంగళవారం మేఘాలయ రాష్ట్రాన్ని కూడా సందర్శించనున్నారు. షిల్లాంగ్ లో రెండు ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు. ఈ నెల 24 న మోడీ ఈ రాష్ట్రాన్ని సందర్శిస్తారని, షిల్లాంగ్ లో ఆ రోజున రోడ్ షో నిర్వహిస్తారని ఆయన వెల్లడించారు.
ఈ సారి మేఘాలయ లో అన్ని .. అరవై అసెంబ్లీ సీట్లకూ బీజేపీ పోటీ చేస్తోంది. ఈ నెల 27 న నాగాలాండ్ తో బాటు మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. మార్చి 2 న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.