ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదాని భారీ అక్రమార్జనకు పాల్పడ్డారని దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో హిండెన్‌బర్గ్ విడుదల చేసిన రిపోర్ట్‌పై దర్యాప్తు జరుపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ప్రధాన ప్రతిపక్షానికి భారీ ఆయుధం దొరకడంతో వినూత్నంగా నిరసనకు ప్లాన్ చేసింది కాంగ్రెస్.ఇందులో భాగంగా ఒక వ్యక్తికి పెళ్లికుమారుడి గెటప్ వేశారు. తలపాగాతోపాటు మెడలో రూ.2,000 నోట్ల దండను వేశారు.
కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు తమ చేతులతో ఆ వ్యక్తిని పైకి ఎత్తారు. బారికేడ్ల అవతల ఉన్న పోలీసుల వైపునకు అతడ్ని పంపేందుకు ప్రయత్నించారు. కాగా, ఢిల్లీ పోలీసులు దీనిని అడ్డుకున్నారు. పెళ్లికుమారుడి గెటప్‌లో ఉన్న వ్యక్తిని చేతులతో కాంగ్రెస్ కార్యకర్తల వైపు నెట్టారు.
అలాగే శాంతంగా ఉండాలని కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు కోరారు. వరుడి గెటప్‌లో ఉన్న వ్యక్తికి దెబ్బతగులవచ్చని వారించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంట్ నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయం వరకు నడిచి వెళ్లారు. అదానీ గ్రూప్ సంస్థలపై దర్యాప్తు కోసం ఈడీ డైరెక్టర్‌ను కలిసి వినతి పత్రం ఇవ్వాలని భావించారు. అయితే ఆ కేంద్ర కార్యాలయం వద్ద భారీగా పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బందిని మోహరించారు.
ఈడీ కార్యాలయం వద్దకు చేరుకునేందుకు ప్రయత్నించిన ఎంపీలను మార్గమధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు తిరిగి పార్లమెంట్‌కు చేరుకున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.