కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఢిల్లీలో ‘భారత్ బచావో’ పేరిట భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తుంది. రామ్ లీలా మైదానంలో జరిగే ఈ బహిరంగ సభకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేతలు సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ ఈ ర్యాలీలో పాల్గొంటారు. ఐసీయులో ఉన్న ఆర్ధిక పరిస్థితి, బీజేపీ ప్రభుత్వ నియంతృత్వం, రైతుల సమస్యలు, పౌరసత్వ బిల్లు, నిరుద్యోగ సమస్యలపై ఈ బహిరంగ సభలో ప్రస్తావించనున్నట్టు రాహుల్ గాంధీ తెలిపారు.
బహిరంగ సభ కోసం కార్యకర్తలను తరలించాల్సిందిగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా కాంగ్రెస్ కమిటీలకు సూచించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే నేతలు, కార్యకర్తలకు రిసీవ్ చేసుకునేందుకు ఢిల్లీ రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులో కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేసింది. రామ్ లీలా మైదానం చుట్టూ సోనియాగాంధీ, రాహుల్ గాంధీ హోర్డింగ్స్ ను ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ విభజన రాజకీయాలు, విద్వేషం, అసమర్ధ పాలనను ప్రపంచానికి తెలియజేయడం కోసమే ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ తెలిపింది.