హిమాచల్‌ప్రదేశ్‌లో విజయం సాధించిన కాంగ్రెస్‌కు ఇప్పుడు అతి పెద్ద సమస్య ముందు వచ్చి పడింది. సీఎం అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలనే అంశం ఇప్పుడు ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటూ ఆమె మద్దతుదారులు పట్టుబడుతున్నారు.
ఈ క్రమంలో రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ నేతల వాహనాలను ఆమె మద్దతుదారులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఎదుట తమ బలాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. నూతన సీఎంను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు రాజీవ్ శుక్లా, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భాఘేల్, హర్యానా మాజీ సీఎం భుపిందర్ హుడా సిమ్లాకు చేరుకున్నారు.
రాష్ట్రంలో విజయం సాధించిన ఎమ్మెల్యేలతో హోటల్ లో ఈ రోజు వారు సమావేశం అయ్యారు. సీఎంగా ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందనే అంశంపై అందరి అభిప్రాయాలను వారు తీసుకున్నారు. దీనిపై తుది నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంటుందని ముగ్గురు నేతలు స్పష్టం చేశారు.
కీలకమైన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశానికి ముందు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ మీడియాతో మాట్లాడారు… తన భర్త, దివంగత మాజీ సీఎం వీరభద్ర సింగ్ పేరు, ఆయన పనితీరు వల్లనే రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం సాధించిందని ఆమె పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని విస్మరించకూడదని, ఈ విజయానికి క్రెడిట్ ను వేరొకరి ఇవ్వడం సరికాదని ఆమె వెల్లడించారు. అందువల్ల తమ కుటుంబాన్ని కాంగ్రెస్ హై కమాండ్ విస్మరించబోదని ఆమె తెలిపారు. ఈ క్రమంలో నూతన సీఎం ఎంపిక కోసం రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ నేతలను ఆమె మద్దతుదారులు అడ్డుకుని బల ప్రదర్శన చేశారు.