ప్రధానమంత్రి కార్యాలయంలో తానో పెద్ద ఉద్యోగినని చెప్పుకుంటూ జమ్మూ కశ్మీర్ లో అధికారులను బోల్తా కొట్టించిన కేటుగాడు అరెస్టయ్యాడు. గుజరాత్ కు చెందిన కిరణ్ పటేల్ అనే ఈ ఫేక్ అధికారి డాబూ, దర్పం చూసి.. నిజంగానే ఇతగాడు ఢిల్లీలో పెద్ద ఉద్యోగం వెలగబెడుతున్నాడని భ్రమ పడిన అధికారులు ఇతనికి ఓ పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో బస కల్పించారు. ప్రధాన మంత్రి కార్యాలయంలో అడిషనల్ డైరెక్టర్ అంటే మాటలా? అనుకుంటూ ఇతనికి బులెట్ ప్రూఫ్ కారుతో జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కూడా కల్పించారు.
ఆ మందీ మార్బలంతో కిరణ్ పటేల్ కశ్మీర్ లోని గుల్ మార్గ్ సహా పలు టూరిస్టు ప్రదేశాలు విజిట్ చేస్తూ ఎంజాయ్ చేశాడు. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో హోటల్ సదుపాయాలు వంటివాటిని మెరుగుపరచేలా తనకు ప్రభుత్వం విశిష్ట బాధ్యతలు అప్పజెప్పిందని ఈయనగారు చెబితే నిజమే కాబోలుననుకున్నారు అధికారులు . పైగా సౌత్ కశ్మీర్ లో యాపిల్ తోటలను కొనుగోలు చేసేవారిని గుర్తించాలని కూడా ప్రభుత్వం తనను కోరిందని చెప్పుకున్నాడు.
మొత్తానికి రెండు సార్లు పటేల్ తన దర్జా వెలగబెట్టాడు. అయితే ఈ నెల 3 న మళ్ళీ మూడోసారి కశ్మీర్ వచ్చినప్పుడు ఇతని బండారం బయటపడింది. ఇతని కదలికలు అనుమానాస్పదంగా కనబడ్డాయి. ఈ నకిలీ ఆఫీసర్ ని పోలీసులు అరెస్టు చేసి శ్రీనగర్ లోని స్థానిక కోర్టులో హాజరు పరిచారు. ఛీటింగ్,ఫోర్జరీ వంటి వివిధ సెక్షన్ల కింద కిరణ్ పటేల్ పై కేసులు పెట్టారు. ఇతని నుంచి ఫోర్జరీ చేసిన ఐడెంటిటీ కార్డులను, ఇతర డాక్యుమెంట్లను వారు స్వాధీనం చేసుకున్నారు.
పారామిలిటరీ సిబ్బంది తన వెంట ఉండగా కశ్మీర్ లోని వివిధ టూరిస్టు ప్రాంతాలను విజిట్ చేస్తున్న పలు ఫోటోలు, వీడియోలను పటేల్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నాడు.