ఒకప్పుడు గేమ్స్ ఆడే వారిని చూసి సమయం ఎందుకు వృథా చేస్తు్న్నారు అంటూ కోపంతో అనేవారు. ఏదైనా ఉద్యోగం చేసుకుంటే కాదా అంటూ సలహాలు ఇచ్చేవారు. కానీ కరోనా తర్వాత ఆ పరిస్థితులు మారిపోయాయి.
ఇప్పుడు భారత్ లాంటి దేశాల్లో గేమ్స్ పై ప్రజల భావన మారుతోంది. గేమ్స్ కొందరికి ఆదాయ మార్గాలుగా మారడం, గేమ్స్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందడం, పరిశ్రమ వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగాలు రావడం వల్ల ఆ భావన ఇప్పుడు మారిపోయింది.
కరోనా సమయంలో పెరిగిన గేమింగ్
కరోనా సమయంలో లాక్ డౌన్ లు, ఐసోలేషన్ ల వల్ల చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. ఆ సమయంలో చాలా మంది ఒంటరితనంతో బోర్ ఫీల్ అయ్యారు. ఈ సమయంలో ఇతరులతో కనెక్ట్ అయ్యేందుకు, పోటీ పడేందుకు, బోర్ ఫీలింగ్ ను దూరం చేసుకోవడానికి ఆన్ లైన్ గేమ్స్ వైపు చూశారు.
ఇండియాలో పెరిగిన ఆన్ లైన్ గేమింగ్
మార్చి- 2022లో గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ ఈవై, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ (ఫిక్కి) ఓ నివేదికను ప్రచురించింది. దీని ప్రకారం గతేడాది భారత్ లో ఆన్‌లైన్ గేమింగ్ సెగ్మెంట్ 28 శాతం పెరిగింది 10,100 కోట్లకు చేరుకుంది.
ఆల్-ఇండియా గేమింగ్ ఫెడరేషన్ (ఏఐజీఎఫ్), ఈవై అంచనాల ప్రకారం 2019లో గేమింగ్ పరిశ్రమ 906 మిలియన్ల అమెరికన్ డాలర్ల నుంచి 2023లో 2 బిలియన్ల డాలర్లకు పైగా వృద్ధిని పొందనున్నట్టుగా అంచనా వేసింది.
వర్క్ ఫ్రమ్ హోమ్ తో పెరిగిన గేమింగ్
కరోనా సంక్షోభం నేపథ్యంలో చాలా కంపెనీలు వారి ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ సౌకర్యాన్ని కల్పించాయి. మరో వైపు విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నడిచాయి. ఈ క్రమంలో అత్యధికులు కంప్యూటర్, మొబైల్స్ కు అంటుకుపోయారు. ఈ సమయంలో ఎక్కువ మంది గేమ్స్ కు అట్రాక్ట్ అయినట్టు నివేదికలు చెబుతున్నాయి.
వినోదం నుంచి సంపాదన వరకు
గతంలో గేమ్ లను వినోదం కోసం మాత్రమే ఆడేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్తితి పూర్తిగా మారిపోయింది. ట్విచ్ లాంటి చాలా గేమ్ లు ఇప్పుడు ఆడుతూ సంపాదించండంటూ అందరిని ఆకర్షిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు చాలా మంది దీన్ని పార్ట్ టైమ్ సంపాదనగా చూస్తున్నారు. గేమింగ్ రంగం మరింత అభివృద్ది చెందితే అది పూర్తి స్థాయి సంపాదన మార్గంగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.